తమ్మీ..! పార్టీ మారకుండ్రి.. అనుచరులకు ఫోన్లు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

తమ అనుచరులకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

టీఆర్​ఎస్​ నుంచి బీజేపీలోకి జంప్​ అవుతారేమోనని భయం

వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ వలసలకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  లీడర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు బీజేపీ బుగులు పట్టుకుంది. తమ అనుచరులు ఎప్పుడు ఎక్కడ బీజేపీలోకి జంప్​ అవుతారోనని కలవరపడుతున్నారు. పార్టీ మారకుండా అనుచరులను, లోకల్​ లీడర్లను సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటుంటే, మరికొందరికి తాయిలాలు ఇచ్చి మనసు మారుస్తున్నారు. గతంలో అపాయింట్​మెంట్  ఇవ్వని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత లోకల్​ లీడర్లకు ఫోన్లు చేసి మంచీచెడులు తెలుసుకుంటున్నారు. ‘‘తమ్మీ..! పార్టీ మారకుండ్రి. మీకు మేమున్నం. త్వరలోనే నామినేటెడ్ పదవులు వస్తయ్. అన్ని రకాలుగా మిమ్మల్ని మేం చూసుకుంటం” అని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బుజ్జగింపులకు తాత్కాలికంగా కొందరు ఓకే చెప్తున్నారు. అయితే.. అట్ల ఓకే చెప్పిన వాళ్లు కూడా సమయం చూసుకొని జంప్​ అయ్యే ప్రమాదం ఉందన్న భయం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఇటీవల నిజామాబాద్​ రూరల్​ జిల్లా ఎంపీటీసీలు, సర్పంచ్​లు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం వారిని వెంటాడుతోంది.

వరంగల్, ఖమ్మం లీడర్లలో మస్తు పరేషాన్​

త్వరలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఎక్కువగా టీఆర్​ఎస్​లోని అసంతృప్త నేతలు పార్టీ మారే చాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లీడర్లు, సిట్టింగ్ కార్పొరేటర్లు పార్టీ మారితే తమ ఇమేజీ దెబ్బతింటుందని వారు పరేషాన్​ అవుతున్నారు.  ఎవరైనా పార్టీ మారుతున్నట్టు అనుమానం వస్తే చాలు.. వారిని పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు. ఖమ్మం సిటీలో బీజేపీ బలం పుంజుకోవడం, ఇటీవల బీజేపీ నేతలు ఖమ్మంలో పర్యటించడంతో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కి టెన్షన్ పట్టుకుందని లోకల్​ లీడర్లు చర్చించుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ లో ఓ సిట్టింగ్ కార్పొరేటర్ బీజేపీలోకి వెళ్లడంతో మరికొంత మంది లీడర్లు కూడా క్యూ కట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

ఎర్రబెల్లికి తమ్ముడి బెంగ

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తమ్ముడు ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమైన్నట్టు వరంగల్​ జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ్ముడు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తే తన పరువు పోతుందన్న బెంగ మంత్రి ఎర్రబెల్లిలో కనిపిస్తోందని, తమ్ముడ్ని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని లోకల్​ లీడర్లు అంటున్నారు. అందుకే ఈ మధ్య ఎర్రబెల్లి మిగతా మంత్రుల కన్నా ఎక్కువగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వరంగల్​కు చెందిన
ఓ ఎమ్మెల్యే అన్నారు.

కట్టడి చేసేందుకు గంగుల ప్రయత్నాలు

కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్​ బీజేపీలో చేరడంతో మంత్రి గంగుల కమలాకర్​ అలర్ట్ అయ్యారు.  తన నియోజకవర్గం నుంచి పార్టీ మారే  ఆలోచనలో ఉన్న లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి నచ్చచెప్తూ, టీఆర్ఎస్ లో ఉంటే లభించే రాజకీయ ప్రయోజనాలు వివరిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి వలసలకు బ్రేకులు పడ్డాయి. అయితే పార్టీ మారేందుకు సిద్ధమైన లీడర్లు పూర్తిగా మనసు మార్చుకున్నారా? లేక సమయం వచ్చినప్పుడు బీజేపీలోకి వెళ్తారా? అన్నది స్థానికంగా చర్చనీయాంశమైంది.

మొన్న నిజామాబాద్​లో ఝలక్​

ఈ మధ్యే నిజాబామాద్ జిల్లా లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు స్థానిక టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్​లు ఝలక్​ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జిల్లా టీఆర్​ఎస్​ పార్టీ వ్యవహారాలను కవిత పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లోని డిచ్ పల్లి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్​లు మూకుమ్మడిగా టీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ను కలిసి బీజేపీలో చేరడంతో కవిత షాక్​కు గురైనట్టు టీఆర్​ఎస్​ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారంపై ఆమె లోకల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిసింది.

For More News..

మగాళ్లకూ ‘ఫెర్టిలిటీ సెంటర్లు’.. మారిన లైఫ్‌స్టైలే కారణం

ఎక్కడోళ్లకు అక్కడ్నే టీకా.. పనిచేసే చోటే వేయాలని నిర్ణయం

ఉద్యోగులకు గంపగుత్తగా ప్యాకేజీ ప్రకటించనున్న సీఎం!