ఖమ్మం, వెలుగు: టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు సూత్రధారి తమ్మినేని కోటేశ్వరరావేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తేల్చారు. ఆరు నెలల కింద ఈ మర్డర్ కోసం కోటేశ్వరరావు ఇంట్లోనే స్కెచ్ వేశారు. గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కృష్ణయ్య భార్య గెలవగా, కృష్ణయ్య కూడా పీఏసీఎస్ డైరెక్టర్ గా గెలుపొందాడు. ఇదంతా భరించలేని కోటేశ్వర్రావు కృష్ణయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. అతడి అడ్డు తొలగితే టీఆర్ఎస్ పార్టీకి ఎదురుండదని భావించాడు. అప్పటికే చేపల చెరువు విషయంలో గజ్జి కృష్ణ, నూకల లింగయ్య, బండారి నాగేశ్వరరావులకు.. కృష్ణయ్యకు మధ్య గొడవలున్నాయి. కృష్ణయ్య అనుచరుడు మహబూబ్ పాషాపై అటెంప్ట్ మర్డర్ కేసులోనూ తమను ఇరికించారన్న కోపంతో నిందితులున్నారు. దీంతో ఆరు నెలల కింద కోటేశ్వరరావు ఫోన్ చేసి గజ్జి కృష్ణ, మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, కన్నెగంటి నవీన్, బండారి నాగేశ్వరరావు, రంజాన్ పాషా, జక్కంపూడి కృష్ణ, మల్లారపు లక్ష్మయ్యలను ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడే హత్యకు ప్లాన్ వేశారు. మారణాయుధాలు కొనేందుకు మెంటల్ శ్రీనుకు కోటేశ్వరరావు రూ.3వేలు ఇచ్చాడు. వాటితో నాలుగు వేటకొడవళ్లు, తల్వార్, గొడ్డలి కొని ఊర్లోని అక్కా చెల్లెళ్లకుంట దగ్గర ఉన్న పొదల్లో దాచి పెట్టారు. అప్పటి నుంచి అదును కోసం ఎదురుచూస్తున్నారు.
ఆరు నెలల్లో మూడుసార్లు చంపాలని చూసినా..
నిందితులు ఆరు నెలల్లో రెండు, మూడుసార్లు హత్యాప్రయత్నం చేసి ఫెయిలయ్యారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారు. ఈనెల 15న కృష్ణయ్య, కొప్పుల ముత్తేశం బైక్ పై వెళ్లడాన్ని చూసిన మల్లారపు లక్ష్మయ్య మెంటల్ శ్రీనుకు చెప్పాడు. దీంతో నిందితులంతా ఒకరికొకరు ఫోన్చేసుకొని కోటేశ్వరరావు ఇంటి దగ్గర కలవాలని, అదే రోజు ప్లాన్ ను అమలు చేయాలని డిసైడయ్యారు. టూవీలర్లపై కోటేశ్వరరావు ఇంటికి వచ్చి, కన్నెగంటి నవీన్ కు చెందిన ఆటోలో ఆయుధాలతో సిద్ధమయ్యారు. బైక్‌పై కృష్ణయ్యను ఫాలో చేస్తున్న మల్లారపు లక్ష్మయ్య, జక్కంపూడి కృష్ణ ఉదయం 11 గంటలకు తెల్దారుపల్లి బస్టాప్ నుంచి కృష్ణయ్య, ముత్తేశం బైక్ పై ఊర్లోకి వస్తున్నారని మెంటల్ శ్రీనుకు చెప్పారు. దీంతో దోబీఘాట్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చి ఆటోతో కృష్ణయ్య వెళ్తున్న బైక్ ను ఢీకొట్టారు. గజ్జి కృష్ణ, మెంటల్ శ్రీను గొడ్డలితో..నూకల లింగయ్య, బండారి నాగేశ్వరరావు కత్తులతో కృష్ణయ్యను నరికారు. స్పాట్ లోనే కృష్ణయ్య చనిపోగా, ఆటోలో ఐదుగురు నిందితులు పరారయ్యారు. ఈ సమయంలో గజ్జి కృష్ణ చెప్పు, ఒక కత్తి మర్డర్ స్పాట్ లోనే పడిపోయాయి.
పని పూర్తయిపోయింది..
మర్డర్ చేసి పారిపోయిన తర్వాత నూకల లింగయ్య రంజాన్ పాషా కు ఫోన్ చేసి కృష్ణయ్యను చంపేశామని, కోటేశ్వరరావుకు చెప్పాలని కోరాడు. తర్వాత జక్కంపూడి కృష్ణకు..మెంటల్ శ్రీను కాల్ చేసి పనిపూర్తయిందని, ఆరెంపులలో ఉన్నామని, చేతి ఖర్చులకు డబ్బులివ్వాలని అడిగాడు. దీంతో జక్కంపూడి కృష్ణ, మల్లారపు లక్ష్మయ్య ఆరెంపులకు వెళ్లి మెంటల్ శ్రీనుకు రూ.12 వేలు ఇచ్చారు. ముల్కలపల్లి బంక్ లో ఆటోలో రూ.500 డీజిల్ కొట్టించుకొని మహబూబాబాద్ వెళ్లారు. తోవలో కొత్త బట్టలు కొనుక్కొని, ఓ చెరువు దగ్గర స్నానాలు చేసి రక్తం మరకలున్న బట్టలు, ఆయుధాలను సంచిలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి గార్లబయ్యారం వరకు ఆటోలో వెళ్లి, ఓ స్కూల్ పక్కన ఆటోను పార్క్ చేసి బస్సులో కొత్తగూడెం, అక్కడి నుంచి విశాఖపట్నం పరారయ్యారు. వైజాగ్ బీచ్ కు ఒక ఆటోలో వెళ్లిన నిందితులు ఆ ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి జక్కంపూడి కృష్ణకు ఫోన్ చేసి కోటేశ్వరరావుతో ఫోన్ చేయించాలని కోరారు. అప్పటికే విజయవాడలో ఉన్న కోటేశ్వరరావు వైజాగ్ ఆటో డ్రైవర్ నంబర్‌కు ఫోన్ చేసి మెంటల్ శ్రీనుతో మాట్లాడాడు. ఓ క్యాబ్ మాట్లాడుకొని విజయవాడ రావాలంటూ చెప్పగా, క్యాబ్ డ్రైవర్ ఫోన్ కు కోటేశ్వరరావు రూ.10 వేలు అమెజాన్ పేలో పంపించాడు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న మెట్రోపాలిటన్ హోటల్ లో నిందితులు కోటేశ్వరరావును కలుసుకున్నారు. అక్కడ మెంటల్ శ్రీనుకు రూ.40 వేలు ఇచ్చిన కోటేశ్వరరావు మళ్లీ అదే క్యాబ్ లో వైజాగ్ పంపించాడు. వైజాగ్ హోటల్ లో ఉన్న మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, బండారి నాగేశ్వరరావు, కన్నెకంటి నవీన్, గజ్జి కృష్ణ ఈనెల 17న మధ్యాహ్నం 1 గంటకు ఖమ్మం వస్తూ వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర జక్కంపూడి కృష్ణ, మల్లారపు లక్ష్మయ్య, రంజాన్ లను కలుసుకున్నారు. మాట్లాడుకుంటుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించి హత్యకు వాడిన ఆయుధాలు, ఆటో, టూవీలర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల19న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
ప్రధాన నిందితుడిని తప్పించేందుకే?
కృష్ణయ్య మర్డర్ కేసులో ఈనెల 19న 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండ్ రిపోర్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కొడుకు నవీన్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావును రిమాండ్ రిపోర్టులో ఏ9గా మార్చారు. కోటేశ్వరరావుతో పాటు ఏ10గా ఉన్న యల్లంపల్లి నాగయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని చెబుతున్నారు. మర్డర్ జరిగినప్పటి నుంచి అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహస్యంగా వ్యవహరిస్తుండడం, రిమాండ్ రిపోర్టును కూడా కొందరు లీగల్జర్నలిస్టులు జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసే వరకు ఇవ్వకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంక్వైరీ జరుగుతున్న తీరును మృతుడి కుటుంబసభ్యులు తప్పుబడుతున్నారు. ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
టీఆర్ఎస్ సైలెన్స్ అందుకేనా?
టీఆర్ఎస్ నేత హత్యకు గురైతే ఆ పార్టీ నేతలు స్పందించిన తీరుపై కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసినా, ఘటనను నిరసిస్తూ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడం, కనీసం పార్టీ పరంగా అధికారికంగా హత్యా రాజకీయాలను ఖండిస్తూ స్టేట్ మెంట్ ఇవ్వకపోవడంపై రాజకీయ కారణాలున్నాయని అనుకుంటున్నారు. రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక, ఇతర పొలిటికల్ అవసరాల నేపథ్యంలోనే కృష్ణయ్య మర్డర్ పై గులాబీ పార్టీ నేతలు మాట్లాడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.