తెల్దారుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు

TRS కార్యకర్త, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు.. తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోటేశ్వర్ రావు గ్రానైట్ కంపెనీపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడ ఓ పొక్లెయిన్ కు నిప్పు పెట్టారు. వెంటనే తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వర్ రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
తెల్దారుపల్లిలో 144 సెక్షన్
పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేయడంతో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు.. తమ్మినేని కోటేశ్వర్ రావు ఇంటిముందు ఆగింది.  దీంతో.. గ్రామస్తులు తమ్మినేని కోటేశ్వర్ రావు ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు విసరడంతో పాటు.. కారును కూడా ధ్వంసం చేశారు. కోటేశ్వర్ రావు ఇంటితో పాటు అతని అనుచరుల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఖమ్మం సీపీ విష్ణువారియర్ తెల్దారుపల్లి గ్రామానికి సందర్శించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. 

తమ్మినేని వీరభద్రం..అతని సోదురులే నిందితులు..
తన భర్తను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, అతని సోదరుడు కోటేశ్వర్ రావులే హత్య చేయించారని కృష్ణయ్య భార్య మంగతాయి ఆరోపించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

తుమ్మల వార్నింగ్..
తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. హత్యా రాజకీయాలను నమ్ముకుని కొంతమంది దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పేద ప్రజల కోసం శ్రమించే వ్యక్తిని హత్య చేయడం దారుణమని అన్నారు. తమ్మినేని కృష్ణయ్య అనుచరులు శాంతిని పాటించాలన్న ఆయన..  నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. తమ్మినేని కృష్ణయ్య హత్య కేసుతో సంబంధమున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు.

జెండా ఎగరేసి వెళ్తుండగా..

పొన్నెకల్‌ రైతు వేదిక వద్ద జాతీయ జెండాను ఎగురవేసి బైక్పై  వెళ్తున్న క్రమంలో తెల్దారుపల్లి గ్రామ సమీపంలోని మద్దులపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద దుండగులు  కృష్ణయ్యపై కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. కృష్ణయ్య మణికట్టును నరికారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. 

తమ్మినేని కుటుంబంలో విబేధాలు

కృష్ణయ్య హత్యతో తమ్మినేని కుటుంబంలో విబేధాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణయ్య.. తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు (బాబాయ్ కొడుకు) అవుతారు. అయితే సీపీఎంతో విభేదించిన కృష్ణయ్య..గతంలో టీఆర్ఎస్‌లో చేరారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృష్ణయ్య అనుచరుడిగా ఉన్నారు. కృష్ణయ్య  భార్య స్థానిక ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నిక కావడం, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం వంటి కారణాలతో కృష్ణయ్యపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్య వెనక తమ్మినేని వీరభద్రం సోదరుడు  కోటేశ్వరరావు ఉన్నారని కృష్ణయ్య అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.