జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఆయనను కాపాడుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రజా ఉద్యమాలు చేయాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జనగామలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తప్పులేనప్పుడు బీజేపీ ఎందుకు అంతలా ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. సిట్ నోటీసులు అందుకున్న బీఎల్ సంతోష్ తరుపున వాదించేందుకు సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి లాయర్లు రావాల్సిన అవసరం ఏముందన్నారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిందని, టీఆర్ఎస్ సర్కారుపై కేంద్రం దాడులతో మళ్లీ సానుభూతి మొదలైందన్నారు.
గొత్తి కోయల చేతిలో ఎఫ్ఆర్ఓ హత్యను ఖండిస్తున్నామన్నారు. గొత్తికోయలను నక్సలైట్లు అనడం తగదన్నారు. వారిని చత్తీస్‌గఢ్ నుంచి వెళ్లగొడితే ఇక్కడికి వచ్చి పోడు చేసుకుని బతుకుతున్నారన్నారు. ఏండ్ల తరబడి నెలకొన్న పోడు సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తమ్మినేని అన్నారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు అప్పటి ప్రతిపాదనల ఆధారంగా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, ఇర్రి అహల్య, బొట్ల చిన్న శ్రీనివాస్, బూడిద గోపీ, ప్రకాశ్ పాల్గొన్నారు.