ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి: తమ్మినేని

ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి: తమ్మినేని

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా ఇద్దరు సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం స్టేట్​సెక్రెటరీ తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ విషయమై సీఎంకు రేవంత్​రెడ్డికి లెటర్​రాశానని చెప్పారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్​లో గురువారం ఏర్పాటైన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ద్వారా దుర్మార్గంగా భద్రాచలాన్ని ముక్కలు చేసి తెలంగాణలో ఐదు గ్రామాలను విలీనం చేసిందని విమర్శించారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలు పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకించినప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరించిందన్నారు. భద్రాచలం చుట్టూ ఆంధ్రా ప్రాంతం ఉండడంతో కనీసం చెత్త పోసుకునే చోటు కూడా లేకుండా పోయిందన్నారు. 

భద్రాచలాన్ని అనుకొని ఉన్న ఆంధ్ర ప్రాంతంలోని పురుషోత్తపట్నం పంచాయతీలో 14 ఎకరాల రాముడి దేవస్థానం భూములున్నాయన్నారు. ఆంధ్రాలో ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం గ్రామపంచాయతీలుండడంతో తెలంగాణ ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్తున్నారన్నారు. పోలవరం బ్యాక్​ వాటర్​తో భద్రాచలం పట్టణం, రామాలయంతో పాటు బూర్గంపహడ్​, సారపాక ఇతర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల ఆరో తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సీఎంలు రేవంత్​రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవడాన్ని సీపీఎం స్వాగతిస్తోందన్నారు.

 గత ప్రభుత్వం కొందరికే పోడు పట్టాలిచ్చిందని, మిగిలిన వాళ్లకు కూడా ఇచ్చే విధంగా రేవంత్​ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ అన్ని పార్టీలు కేంద్రం తీరుపై పోరాటాలు చేయాలన్నారు. ఈ మీటింగ్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్​, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు కాసాని ఐలయ్య, కె. పుల్లయ్య, నర్సారెడ్డి, జ్యోతి, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ నబి, ఆర్​. శ్రీనివాస్​ పాల్గొన్నారు.