హైదరాబాద్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇప్పటికే ఐదు సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఒకటి, రెండ్రోజుల్లోనే మిగిలిన స్థానాల్లోనూ ఖరారు చేసి ప్రకటించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన సొంత నియోజకవర్గం పాలేరు నుంచి పోటీ చేయనున్నారు.
మధిర నుంచి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్, భద్రాచలం నుంచి ఆ నియోజకవర్గ కో కన్వీనర్, గిరిజన సంఘం నేత కారం పుల్లయ్య, మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరుల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఖమ్మం స్థానం నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిలో సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మాచర్ల భారతి, వైరా నుంచి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం, జనగామలో ఆ జిల్లా సీపీఎం కార్యదర్శి కనకా రెడ్డి, ముషీరాబాద్‌లో సిటీ సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు దశరథ్ పేర్లు ఖరారైనట్టు తెలిసింది.
దీంతో పాటు ఇబ్రహీంపట్నంలో సీపీఎం సీనియర్ నేత యాదయ్య లేదా జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, భువనగిరిలో ఆ పార్టీ నేత కొండమడుగు నర్సింహా లేదా జహంగీర్ పోటీ చేసే అవకాశముంది. అయితే కోదాడ, హుజూర్నగర్, పటాన్చెరు, నల్గొండ, అశ్వరావుపేట తదితర స్థానాలను ఇవ్వాలో, రేపో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే నామినేషన్లు మొదలు కావడంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర నాయ కత్వం భావిస్తోంది.
ఎన్నికల కోసం సీపీఎం కమిటీలు
ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోపై సీపీఎం ఫోకస్ పెట్టింది. దీనికోసం 4 కమిటీలను నియమించింది. మేనిఫెస్టో కమిటీతో పాటు ప్రచార కమిటీ, ఎలక్షన్ కమిటీ, ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కమిటీలో సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్, జాన్ వెస్లీ, అబ్బాస్‌ను నియమించారు.
సెంటర్ కో ఆర్డినేషన్ కమిటీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జ్యోతి, ప్రభాకర్.. ప్రచార కమిటీలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సాగర్, అబ్బాస్, బాబురావు.. ఎన్నికల కమిటీలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నర్సింహారావు, బాబురావును నియమించారు. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ వివిధ వర్గాల నుంచి వివరాలు సేకరించి డ్రాఫ్ట్ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇవ్వాలో, రేపో అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. మరోపక్క ప్రచార కమిటీ కూడా కరపత్రాలు, పోస్టర్లతో పాటు జెండాలు, ఇతర సామగ్రిని రెడీ చేస్తోంది.