తూకంలో మోసం..కిలో జోకితే 900 గ్రాములే వస్తుంది

  • తూకాల్లో దోపిడీ
  •     దోపిడీకి గురవుతున్న ప్రజలు

సూర్యాపేట, వెలుగు : ప్రజల అవసరం, ఆఫీసర్ల నిర్లక్ష్యం కొందరు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. అక్రమాలకు అలవాటు పడిన కొందరు వ్యాపారులు ఎలక్ట్రానిక్‌‌ కాంటాలను సైతం ట్యాంపర్‌‌ చేస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు. పెట్రోల్‌‌ బంక్‌‌లు మొదలుకొని కిరాణ, రేషన్‌‌ షాపులు, పండ్లు, మాంసం, కూరగాయలు అమ్మే దుకాణాల వరకు తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతుండడంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

కిరాణ కొట్టు నుంచి పెట్రోల్‌‌ బంక్‌‌ వరకు...

సూర్యాపేట, కోదాడ, హుజూర్‌‌నగర్‌‌, తిరుమలగిరితో పాటు పలు మండలాల్లో ఎక్కువగా బిజినెస్‌‌ నడుస్తుంటుంది. సాధారణ కాంటాల్లో మోసాలు జరిగే అవకాశం ఉండడంతో ప్రతి షాపు ఓనర్‌‌ ఎలక్ట్రానిక్‌‌ కాంటానే వాడాలని ఆఫీసర్లు ఆదేశించారు. వ్యాపారులు ఎలక్ట్రానిక్‌‌ కాంటాలతో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కాంటాలో ముందుగానే 100 గ్రాములు పెంచి ఆ తర్వాత జీరోకు సెట్‌‌ చేస్తున్నారు. కొందరు యజమానులు కాంటాంపై ఉంటే ప్లేట్‌‌ బరువును సైతం తూకంలో కలిపేస్తున్నారు. దీంతో ఒక్కో కేజీకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తేడా కనిపిస్తోంది. 

అలాగే వే బ్రిడ్జిలు, పెట్రోల్‌‌ బంకుల్లోనూ భారీ మొత్తంలో తేడాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని పెట్రోల్‌‌ బంకుల్లో కొలతల్లో తేడాలు రావడంతో వినియోగదారులు బంక్‌‌ యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బంకుల్లో పెట్రోల్, డీజిల్‌‌ కొలతలు నమోదు చేసే టైంలో ఆఫీసర్లు ఉండకపోవడంతో ఓనర్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో లీటర్‌‌కు 50 నుంచి 100 మిల్లీలీడర్లు తక్కువ పడేలా సెట్‌‌ చేస్తున్నట్లు బంకుల్లో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. 

పట్టించుకోని ఆఫీసర్లు

సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల దుకాణాలు, పెట్రోల్‌‌ బంక్‌‌లు, వే బ్రిడ్జిలు కలిపి సుమారు 90 వేల వరకు ఉన్నాయి. కాంటాలు, తూకం రాళ్లను రెండేళ్లకోసారి, ఎలక్ట్రానిక్‌‌ కాంటాలను ఏడాదికోసారి తూనికలు, కొలతల శాఖ ఆఫీసర్లు తనిఖీ చేసి స్టాంపింగ్‌‌ చేయాలి. జిల్లాలో తూనికలు, కొలతల పరికరాలు అమ్మేందుకు కేటగిరి 1 కింద సూర్యాపేటలో 3 షాపులకు పర్మిషన్‌‌ ఉండగా, కేటగిరి 2 కింద సూర్యాపేట, కోదాడలో ఒక్కో షాప్‌‌ పర్మిషన్‌‌ పొందాయి. తూనికల పరికరాలకు స్టాంపింగ్‌‌ వేసేందుకు సూర్యాపేటలో నలుగురికి, కోదాడలో ఇద్దరికి పర్మిషన్స్‌‌ ఉన్నాయి. అయితే ఆఫీసర్లు అంతగా పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. 

జిల్లా కేంద్రంలోని తూనికల శాఖ ఆఫీస్‌‌లో సిబ్బంది సైతం అందుబాటులో ఉండరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌‌ నుంచి డిసెంబర్‌‌ వరకు 168 కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.   సూర్యాపేటకు చెందిన రామారావు అనే వ్యక్తి ఇటీవల పట్టణంలోని ఓ షాపులో కిలో చికెన్‌‌ తీసుకున్నారు. బరువు తక్కువ ఉన్నట్లు అనుమానం రావడంతో మరో దుకాణంలో తూకం వేయిస్తే 900 గ్రాములే ఉంది.  సూర్యాపేటకు చెందిన ఓ మహిళా కిరాణ షాపులో 2 కిలోల కందిపప్పు తీసుకుంది. మరో దుకాణంలో తూకం వేయగా 1,900 గ్రాములే కనిపించింది. దీంతో ఆ మహిళ సదరు వ్యాపారి మధ్య వాగ్వాదం జరిగింది. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

వినియోగదారులను మోసం చేస్తే సహించేది లేదు. తూకాల్లో మోసం జరిగినట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. కాంటాలను ట్యాంపర్‌‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  -  వెంకటేశ్వర్లు, తూనికలు, కొలతల శాఖ అధికారి, సూర్యాపేట