- కొనసాగుతున్న తండా వాసుల ఆందోళన
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల సరిహద్దులో తండా వాసులు చేస్తున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను కొంతమంది బడా బాబులకు అక్రమంగా కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ కొన్ని రోజులుగా వెలిమెల, కొండకల్బార్డర్లో ఉన్న తండా వాసులు ఆందోళన చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తండా వాసులైన పాల్త్యా దేవులా, నుస్నావత్, రాంచందర్, చంద్ర బాయ్మాట్లాడుతూ.. తాతలు, తండ్రులు కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కొంతమంది అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు.
కబ్జాలో ఉన్న తమకే ఆ భూములు కేటాయించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు దౌర్జన్యంగా సదరు భూములను కొంతమంది పెత్తందారులకు కట్టబెడుతున్నారని, దానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. వందలాది మంది పోలీసులను, ప్రైవేట్ వ్యక్తులను పహారా పెట్టి భూములను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఈ భూ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని కోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా తండా వాసులను అదుపులోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించే వారకు తమ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ సంగ్రామ్రెడ్డిని వివరణ కోరగా నిబంధనల ప్రకారమే అక్కడ భూ బదలాయింపులు జరిగాయని, గిరిజనులకు సంబంధించిన భూములంటూ ఎక్కడా లేవని, చట్ట ప్రకారం ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. c