Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్.. రోహిత్ స్టయిల్లో సెలబ్రేషన్స్

Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్.. రోహిత్ స్టయిల్లో సెలబ్రేషన్స్

చెస్‌‌లో ఒలింపిక్స్‌‌ స్థాయి ఈవెంట్‌‌ అయిన చెస్ ఒలింపియాడ్‌‌లో ఇండియా స్వర్ణ చరిత్ర సృష్టించింది. ఒకేసారి అటు అబ్బాయిల, ఇటు అమ్మాయిల జట్లు బంగారు పతకాలు గెలిచి డబుల్ ధమాకా మోగించాయి. ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో  ఓపెన్‌‌, విమెన్ ఈవెంట్లలో ఇండియా చాంపియన్‌‌గా నిలిచింది. చారిత్రాత్మక డబుల్ స్వర్ణం విజయోత్సవాన్ని చెస్ టీం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శైలిలో సంబరాలు జరుపుకోవడం విశేషం. 

భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ.. అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ శైలిలో ట్రోఫీని అందుకున్నాడు. 2022 ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా గెలవడంతో మెస్సీ ట్రోఫీ తీసుకొని చిన్నగా అడుగులే వేస్తూ ఈ సెలెబ్రేషన్ ను స్టార్ట్ చేశాడు. తాజాగా మన చెస్ టీం జాతీయ త్రివర్ణ పతాకాన్ని పోడియంపై సగర్వంగా ప్రదర్శించి రోహిత్ ను ఫాలో అయ్యారు.

ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో  ఓపెన్‌‌, విమెన్ ఈవెంట్లలో ఇండియా చాంపియన్‌‌గా నిలిచింది. ఓపెన్‌‌లో ఎరిగైసి అర్జున్‌‌, దొమ్మరాజు గుకేశ్‌‌,  పెంటేల హరికృష్ణ, ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీతో కూడిన మెన్స్‌‌ టీమ్‌‌ 11 రౌండ్లలో 22 పాయింట్లకు గాను అత్యధికంగా 21 పాయింట్లు సాధించి  అగ్రస్థానం కైవసం చేసుకుంది. 11 రౌండ్లలో అజేయంగా నిలిచి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జున్‌‌ మూడో బోర్డులో, గుకేశ్‌‌ టాప్‌‌ బోర్డులో  వ్యక్తిగత స్వర్ణాలు కూడా అందుకున్నారు.

మరోవైపు  హారిక నేతృత్వంలోని విమెన్స్‌‌ టీమ్ చివరి రౌండ్‌‌లో కీలక విజయంతో 19 పాయింట్లతో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. ఈ జట్టులో ఆర్‌‌‌‌. వైశాలి, దివ్య దేశ్‌‌ముఖ్‌‌, వంతిక అగర్వాల్‌‌, తానియా సచ్‌‌దేవ్‌‌ ఉన్నారు. దివ్య, వంతిక 3,4వ బోర్డుల్లో వ్యక్తిగత స్వర్ణాలు గెలిచారు. కాగా, మెగా టోర్నీలో ఇది వరకు  ఇండియా మెన్స్‌‌ టీమ్ 2014, 2022 ఎడిషన్లలో కాంస్య పతకాలు గెలిచింది. అమ్మాయిల జట్టు చెన్నైలో జరిగిన 2022 ఎడిషన్‌‌లో కాంస్యం నెగ్గింది.