హాస్పిటల్ అడిగినంత డబ్బులు కట్టలేకపోయారు.. ఏడు నెలల గర్భిణి ప్రాణం పోయింది !

హాస్పిటల్ అడిగినంత డబ్బులు కట్టలేకపోయారు.. ఏడు నెలల గర్భిణి ప్రాణం పోయింది !

పుణె: కార్పొరేట్ హాస్పిటల్ ధన దాహానికి ఏడు నెలల గర్భిణి నిండు ప్రాణం బలైపోయింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తానీషా భీసే అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను పుణెలోని దీనానాథ్ మంజేష్కర్ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. నెలలు నిండక ముందే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆమెను అడ్మిట్ చేసుకునేందుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్ నిరాకరించింది. ఆమెకు చికిత్స చేయాలంటే 10 లక్షలు కట్టాలని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. 

ALSO READ : ఆస్తుల వెల్లడికి సుప్రీం జడ్జిలు ఓకే

రెండున్నర లక్షలు కడతామని, ముందు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆమె కుటుంబం హాస్పిటల్ యాజమాన్యాన్ని వేడుకుంది. కనీస కనికరం లేకుండా ఆమెను చేర్చుకోకపోవడంతో ఆ గర్భిణి ఆరోగ్యం మరింత క్షీణించింది. మరో హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించగా ఇద్దరు కవల పిల్లలకు ఆ గర్భిణి జన్మనిచ్చింది. కానీ.. దురదృష్టవశాత్తూ తానీషా చనిపోయింది.

వైద్యం సకాలంలో అందకపోవడానికి దీనానాథ్ మంజేష్కర్ హాస్పిటల్ చేసిన ఆలస్యమే కారణమని, తన భార్యను సదరు హాస్పిటల్ పొట్టనపెట్టుకుందని తానీషా భర్త సుశాంత్ కన్నీరుమున్నీరయ్యాడు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్కే పీఏనే ఈ సుశాంత్. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్కే విచారం వ్యక్తం చేశారు. సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 లక్షల వరకూ డబ్బు కట్టడానికి ముందుకొచ్చినా అడ్మిట్ చేసుకోకపోవడం దారుణమని ఎమ్మెల్సీ వాపోయారు.