ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు ఆదివారం సందడిగా మారాయి. సెలవు దినం కావడంతో పిల్లాపాపలతో వేలాదిగా ప్రజలు ఉత్సవాలకు తరలివచ్చారు. సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ఎయిర్ షో అట్టహాసంగా సాగింది. 15 సూర్య కిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
రాత్రి ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ షో యూత్‌లో జోష్ నింపింది. సెక్రటేరియట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు మొత్తం మూడు స్టేజీలు ఏర్పాటు చేసి, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల కోలాటం, చిందు యక్షగానం, భరతనాట్యం, మోహినీ అట్టం, మిమిక్రీ, పేరిణీ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్, మెప్మా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్, హాండీ క్రాఫ్ట్స్ స్టాళ్లు జనంతో కిటకిటలాడాయి.