![బడుగువర్గాల ఆత్మబంధువు.. భాగ్యరెడ్డివర్మ](https://static.v6velugu.com/uploads/2022/09/tankbund-untold-stories-bhagyareddy-varma_ODTuqPcVxn.jpg)
20వ శతాబ్దం మొదట్లోనే దళితుల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ రాజ్యంలో ఒక గొంతు బలంగా వినిపించింది. అంటరానివాళ్లం కాదు ఈదేశ మూలవాసులం అని చాటిన వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ. 1888 మే 22న హైదరాబాద్ లో మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు బాగయ్య పుట్టారు. చిన్నతనంలోనే వివక్షను ఎదుర్కొన్నారు. దీన్ని ఎదిరించడానికి సామాజిక చైతన్యం ఉండాలని, అందుకు చదువే మార్గమని ఆయన అర్థం చేసుకున్నారు. దళితులే ఈ దేశ మూలవాసులనీ, అసలైన పాలకులని గురువు చెప్పిన మాటలు ఆయన మనసులో నాటుకున్నాయి. పేరును బట్టే గౌరవించే సమాజం తీరును హేళనచేస్తూ తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నారు. తర్వాత ఆర్యసమాజం ఆయనకు వర్మ అనే బిరుదు ఇవ్వడంతో భాగ్యరెడ్డివర్మ అయ్యారు.
సామాజిక న్యాయం కోసం పోరాడిన మహాత్మా జ్యోతీరావు ఫూలే స్ఫూర్తిని అందుకున్న భాగ్యరెడ్డివర్మ దళితుల కోసం గొంతెత్తారు. పంచములం కాదు, మూలవాసులం, ఆదిహిందువులమంటూ ఉద్యమించారు. ఆదిహిందూ మహాసభను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దళితుల్లో చైతన్యం కోసం 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించి హరిదాసులు, మాల జంగాలతో హరికథలు చెప్పించారు. ఆ కార్యక్రమాల మొదట్లో, ముగింపులో భాగ్యరెడ్డివర్మ తన ప్రసంగాలతో చైతన్యం కలిగించేవారు. దళిత బిడ్డలకు చదువు చెప్పించడానికి 1910లో ఇసామియా బజారులో ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. కొద్దిరోజుల్లోనే 2600 మంది పిల్లలతో 25 పాఠశాలలను నడిపారు. 1911లో సబ్బండవర్ణాలతో సహపంక్తి భోజనాలు నిర్వహించారు. వర్ణవ్యవస్థను నిరసిస్తూ బౌద్ధధర్మాన్ని ప్రచారం చేశారు.
1911లో ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ ఆదిహిందువుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1917లో ఆయన అధ్యక్షుడిగా విజయవాడలో ప్రథమాంధ్ర ఆది హిందూ సదస్సు జరిగింది. అదే ఏడు కలకత్తాలో జరిగిన అఖిల భారత హిందూ సంస్కరణ సభలో భాగ్యరెడ్డి ప్రసంగం గాంధీజీని ఆకట్టుకుంది. ఉత్తర భారతదేశంలో అంబేద్కర్ ఉద్యమాలకు భాగ్యరెడ్డి నడిపించిన దళిత ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. దేశవ్యాప్తంగా ఆదిజన మూలవాసీ ఉద్యమానికి భాగ్యరెడ్డి దారి చూపించారు. జంగములు, దాసరులతో పాటు దళిత ఉపకులాల మధ్య సమన్వయం కోసం 1919లో ఆదిహిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. దళితుల్లో అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు కులపెద్దల పంచాయితీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆదిహిందువుల్లో చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల వస్తుప్రదర్శనను నిర్వహించారు.
1927 నుంచి 1931 వరకు జాతీయ నిమ్నవర్గాల మహాసభలను భాగ్యరెడ్డి అధ్యక్షుడిగా విజయవంతంగా నిర్వహించారు. 1931లో లక్నో సభలో ఆయన చారిత్రాత్మక తీర్మానం చేశారు. దేశంలోని ఏడుకోట్ల దళితుల సమస్యలను బ్రిటీష్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ ను ప్రతినిధిగా పంపాలని నిర్ణయించారు. పంచములు, అవర్ణులు, మాల, మాదిగ లాంటి పేర్లతో కాకుండా ఆదిహిందువులుగా పిలవాలన్న డిమాండ్ ను భాగ్యరెడ్డి బలంగా వినిపించారు. దీనికి ఒప్పుకున్న నిజాం ప్రభుత్వం 1931 జనాభా లెక్కల్లో దళితులను ఆదిహిందువులుగా నమోదుచేసింది.
బాల్యవివాహాలు, జోగిని వ్యవస్థ రద్దు కోసం భాగ్యరెడ్డి కృషిచేశారు. దళితుల చదువుతో పాటు దురలవాట్లు లేని సమాజం కోసం ఆయన పాటుపడ్డారు. హైదరాబాద్ సంస్థానంతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రా ప్రాంత దళితుల సమస్యలపై ఆయన ఉద్యమించారు. హైదరాబాద్ చాదర్ ఘాట్ దగ్గర ఆయన ప్రారంభించిన ఆదిహిందూ భవన్ ఎన్నో సామాజిక ఉద్యమాలకు కేంద్రమైంది.
జీవితాంతం బడుగు వర్గాల బాగును కోరుకున్న భాగ్యరెడ్డివర్మ 1939 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన స్మారకంగా 1943లో మొదలుపెట్టిన బాలికల హైస్కూల్ ఇప్పటికీ నడుస్తోంది. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలుగా మిగిలింది కూడా ఇవే. దళిత చైతన్యం కోసం తపించిన వైతాళికుడి సేవలకు ప్రభుత్వాల నుంచి తగిన గౌరవం దక్కలేదు.