హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌తో గురువారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 291/2 స్కోరు చేసింది. తన్మయ్‌తో పాటు వరుణ్ గౌడ్ (21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
టాస్ నెగ్గిన హైదరాబాద్‌కు తన్మయ్ కీలక భాగస్వామ్యాలు అందించాడు. హిమాచల్ బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో అభిరత్ రెడ్డి (73)తో తొలి వికెట్‌కు 147, రాహుల్ రాధేశ్ (52)తో రెండో వికెట్‌కు 111 రన్స్ జోడించారు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తన్మయ్‌కు ఇది 15వ సెంచరీ కావడం విశేషం. ఆకాశ్ వశిష్ట్, అపూరవ్ వాలియా చెరో వికెట్ తీశారు.