- రాహుల్ సింగ్ సెంచరీ
- హైదరాబాద్ 529/1
హైదరాబాద్, వెలుగు : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. ప్లేట్ డివిజన్ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (160 బాల్స్ లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 బ్యాటింగ్) ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. కెప్టెన్ రాహుల్ సింగ్ (105 బాల్స్ లో 26 ఫోర్లు, 3 సిక్సర్లతో 185) కూడా సెంచరీ కొట్టడంతో హైదరాబాద్ తొలి రోజే 48 ఓవర్లలో 529/1 స్కోరు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన అరుణాచల్ జట్టు 39.4 ఓవర్లలో 172 రన్స్ కే ఆలౌటైంది.
టెచి దోర్జా (97) సత్తా చాటాడు. ఆతిథ్య బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ చెరో మూడు, తనయ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన హైదరాబాద్ ఓపెనర్లు టీ20 స్టయిల్లో దంచికొట్టారు. ఓవర్‌కు 11 రన్‌రేట్ తో పరుగులు రాబట్టారు. డబుల్ సెంచరీ ముంగిట రాహుల్ ఔటైనా.. అభిరథ్ రెడ్డి (19 బ్యాటింగ్)తో కలిసి తన్మయ్ రోజును ముగించాడు. ప్రస్తుతం హైదరాబాద్ 357 రన్స్ ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఒక్క రోజే 701 రన్స్ నమోదవడం విశేషం. ఓవరాల్‌గా ట్రిపుల్ సెంచరీ చేసిన తన్మయ్ (147 బాల్స్) .. మార్కో మైరస్ (సౌతాఫ్రికా–191 బాల్స్) రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇషాన్ కిషన్ (14) రికార్డును కూడా తన్మయ్ బద్దలుకొట్టాడు. తన్మయ్–రాహుల్ 40.2 ఓవర్లలో 449 రన్స్ జత చేయగా, ఇందులో 105 బాల్స్‌లోనే 185 రన్స్ చేయడం విశేషం.