IPL 2025: అప్పుడు విరాట్ కోహ్లీ టీమ్ మేట్..వరల్డ్ కప్ ఫైనల్ టాప్ స్కోరర్.. ఇప్పుడు ఐపీఎల్ అంపైర్!

IPL 2025: అప్పుడు విరాట్ కోహ్లీ టీమ్ మేట్..వరల్డ్ కప్ ఫైనల్ టాప్ స్కోరర్.. ఇప్పుడు ఐపీఎల్ అంపైర్!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీమ్ మేట్ ఐపీఎల్ 2025లో అంపైర్ గా అరంగేట్రం చేయబోతున్నాడు. 2008లో కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్ లో తొలి సారి అంపైర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాదు అతను ఐపీఎల్‌లో రెండు సీజన్లు కూడా ఆడాడు. శ్రీవాస్తవ దేశీయ క్రికెట్‌లో రెగ్యులర్ అంపైర్‌గా కొనసాగుతున్నాడు. సర్టిఫైడ్ లెవల్-2 కోచ్‌గా కూడా ఉన్నాడు. 

శ్రీవాస్తవకు ఈ ఘనత దక్కినందుకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) అభినందనలు తెలిపింది. "నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వదిలి వెళ్ళడు. క్రికెట్ పై ఇష్టంతో ఐపీఎల్ లో కొత్త టోపీ ధరిస్తున్నందుకు తన్మయ్ శ్రీవాస్తవకు శుభాకాంక్షలు!" అని ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలు అభినందనలు తెలిపింది. 30 ఏళ్లకు ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన శ్రీవాస్తవ వెంటనే కోచింగ్, దేశీయ క్రికెట్‌లో అఫిషియేటింగ్‌గా చేరాడు.

ALSO READ | హెచ్సీఏ నిధుల్లో గోల్ మాల్.. రూ.51 లక్షలు అటాచ్‌ చేసిన ఈడీ

ఐపీఎల్ లో తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ శ్రీవాస్తవ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టాడు. 90 రెడ్-బాల్ మ్యాచ్‌ల్లో 4,918 పరుగులు చేసిన అద్భుతమైన రికార్డ్ ఉంది. శ్రీవాస్తవ 2008, 2009 ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు. కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో మాత్రమే అతనికి బ్యాటింగ్ అవకాశం వచ్చిన అతను కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. శ్రీవాస్తవ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో టాప్ స్కోరర్ కావడం విశేషం. అప్పటి జట్టులో విరాట్ కోహ్లీ, మనీష్ పాండే , రవీంద్ర జడేజాలు కూడా ఉన్నారు. ఫైనల్లో శ్రీవాస్తవ  74 బంతుల్లో 46 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఇండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.