పునర్నిర్మాణం అంటే తిట్ల పురాణమా : హరీశ్​రావు

  • రేవంత్ ​భాష సంస్కారహీనం 
  • హామీలు అమలు చేయలేక పోలీసోళ్ల కాపలాతో తిరగాల్సి ఉంటుంది 
  • కాంగ్రెస్​కు ముందుంది ముసళ్ల పండగ

భద్రాచలం/మణుగూరు, వెలుగు:  తెలంగాణ పునర్నిర్మాణం అంటే తిట్ల పురాణమా అని సీఎం రేవంత్​రెడ్డిని బీఆర్ఎస్​ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు ప్రశ్నించారు. మహబూబాబాద్​ లోక్​సభ నియోజకవర్గంలో పార్లమెంట్​ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా భద్రాచలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో శనివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి భాష సంస్కారహీనంగా ఉందని, దేశంలోనే ఇంతలా అనాగరికంగా మాట్లాడే సీఎం ఆయనేనని అన్నరు. 

హామీలు అమలు చేసే దారి లేక ప్రస్టేషన్​లో సీఎం బీఆర్ఎస్​ను తిడుతున్నారని, సంయమనం పాటిద్దామని కార్యకర్తలకు సూచించారు. గోబెల్​ ప్రచారాలతో జనాన్ని కన్ఫ్యూజ్​ చేసి ఎన్నికల్లో గెలిచారన్నారు. ఇచ్చిన 420 హామీలను అమలు చేయడం కష్టమని, కాంగ్రెస్​కు ముందుంది ముసళ్ల పండుగ​అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్​ లీడర్లు పోలీసోళ్ల సాయంతో గ్రామాల్లో తిరగాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్​ రావాలని, ప్రధానిగా రాహుల్​గాంధీ కావాలని ఇప్పుడు చెప్పడం దారుణన్నారు. 

తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్​గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలే లేవన్నారు. రూ.3.80 లక్షల కోట్ల అప్పులుంటే రూ.7లక్షల కోట్లు అప్పు చేసినమని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పిన కాంగ్రెస్​సర్కారు రెండు నెలల్లోనే రూ.14వేల కోట్లు అప్పుల ఎలా చేసిందని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం తో ఆటో కార్మికుల ఈఎంఐలు కట్టలేక 12 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్​సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటం తప్పదన్నారు. 

అంతకు ముందు హరీశ్​రావు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అలాగే మణుగూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ  జనవరి గడిచిపోయి ఫిబ్రవరి వచ్చినా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వలేదన్నారు.  గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఖండించారు. ఫిబ్రవరి 1న ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ తప్పుడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. 

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబ్​బాద్​ఎంపీ మాలోత్​ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, దిండిగల రాజేందర్​, మాజీ ఎస్సీ,ఎస్టీ కమిటీ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ ఉన్నారు.