టాంజానియాలో భారీ విషాద సంఘటన జరిగింది. మొరొగొరో పట్టణంలోని ఓ బిజీరోడ్డులో ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడంతో… కనీసం 61 మంది చనిపోయారు. 70 మంది గాయపడ్డారు. వారందరినీ హాస్పిటల్ లో చేర్పించారు. ఆయిల్ ట్యాంకర్ ను వేగంగా నడుపుతూ…. బస్టాండ్ ఏరియాలో… ఓ మోటర్ సైకిల్ ను ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ…. ఆయిల్ ట్యాంకర్ ను ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. దీంతో… ట్యాంకర్ కంట్రోల్ తప్పింది. రోడ్డుపై బోల్తా పడింది. రోడ్డును రాసుకుంటూ వెళ్లడంతో.. నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ లోని ఆయిల్ లీక్ కావడంతో మంటలు ఎగసిపడ్డాయి. అప్పటికే ట్యాంకర్ బస్టాండ్ ఏరియాలో జనం మధ్యలోకి దూసుకుపోయింది. అదే సమయంలో ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడంతో… భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగింది.
ప్రమాదం జరిగినప్పుడు ఆ ఏరియాలో 200 మందికి పైగా జనం ఉన్నట్టు సాక్షులు చెప్పారు. పేలుడు ధాటికి జనం ఎగరిపడ్డారు. వాహనాలు చెల్లాచెదురయ్యాయి. వాహనం చుట్టుపక్కల ఉన్నవాళ్లు మంటలకు ఆహుతైపోయారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని భయానక వాతావరణం కనిపించింది.