T20 World Cup 2024: కోహ్లీతోనే పెట్టుకున్నాడు: విరాట్‌పై బంగ్లా ఫాస్ట్ బౌలర్ ఓవరాక్షన్

T20 World Cup 2024: కోహ్లీతోనే పెట్టుకున్నాడు: విరాట్‌పై బంగ్లా ఫాస్ట్ బౌలర్ ఓవరాక్షన్

కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉంది. గ్రౌండ్ లో దూకుడుగా ఉంటున్నా.. వ్యక్తిగతంగా ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వడం లేదు. ఒకప్పుడు ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే అసలు ఊరుకొని కోహ్లీ.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. తనతో గొడవపడినవారిని కూడా మిత్రులుగా మార్చుకుంటున్నాడు. దీంతో కోహ్లీపై స్లెడ్జింగ్ అంటే ఎవరైనా భయపడతారు. అయితే బంగ్లాదేశ్ యువ బౌలర్ టాంజిమ్ హసన్ కోహ్లీ విషయంలో ఓవర్ యాక్షన్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
 
 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా శనివారం (జూన్ 23) భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆంటిగ్వా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓపెనర్ గా అదరగొట్టాడు. ఈ టోర్నీలో తొలిసారి స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించిన విరాట్.. భారీ స్కోర్ దిశగా తన దూకుడు కొనసాగింది. అయితే ఇన్నింగ్స్ 9 ఓవర్లో టాంజిమ్ హసన్ వేసిన ఒక అద్భుత బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ముందుకొచ్చి భారీ షాట్ కు ప్రయత్నించిన కోహ్లీ.. బంతి ఇన్ స్వింగ్ తిరగడంతో క్లీన్ బౌల్డయ్యాడు. ఔటైన నిరాశలో విరాట్ పెవిలియన్ కు వెళ్తుండగా బంగ్లా బౌలర్ హద్దులు మీరు ప్రవర్తించాడు. కోహ్లీ వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. 

సాధారణంగా కోహ్లీని గెలకడానికి ఎవరూ కూడా సాహసించరు. కానీ బంగ్లా ఫాస్ట్ బౌలర్ మాత్రం కాస్త ఓవరాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ  28 బంతుల్లోనే మూడు సిక్సులు, ఒక ఫోర్ తో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే  బంగ్లాదేశ్ పై 50 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 పరుగుల భారీ ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. దీంతో 146 పరుగులకే పరిమితమైంది.