ట్యాపింగ్, స్టింగ్ ఆపరేషన్లు కేటీఆర్​కు అలవాటే

ట్యాపింగ్, స్టింగ్ ఆపరేషన్లు కేటీఆర్​కు అలవాటే
  • ఇతరుల వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడంలో ఆయన దిట్ట
  • మీడియాతో చిట్ చాట్​లోమంత్రి కొండా సురేఖ ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్, స్టింగ్ ఆపరేషన్లు చేసి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడం మాజీ మంత్రి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని దేవాదాయ శాఖ మంత్రి కొండా  సురేఖ అన్నారు. సీఎం రేవంత్ పై కేటీఆర్  చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

సెల్ఫ్ డ్రైవింగ్, గోడలు దూకడం కేటీఆర్ కే ఎక్కువ తెలుసని, తనకు ఉన్న అలవాట్లే అందరికీ ఉంటాయని కేటీఆర్  అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి సురేఖ చిట్ చాట్  చేశారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట  బోర్డు ఉండాలని చట్టసవరణ చేశామని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందని, యాదాద్రి బోర్డులో ప్రభుత్వ పాత్ర, అజమాయిషీ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణను పొట్టిశ్రీరాములు తీవ్రంగా వ్యతిరేకించారని, కేంద్ర  ప్రభుత్వ సంస్థలకు ఆయన పేరు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. యూనివర్సిటీ పేరు మార్చే విషయంలో వివాదాలు సృష్టంచే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారని, ఇది చాలా బాధాకరమన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తామని, అన్యాక్రాంతం కాకుండా మహిళా సంఘాలకు లీజుకు ఇస్తామని తెలిపారు.  

దేవాలయాల్లోఉన్న  బంగారానికి  సంబంధించిన పూర్తి వివరాలు తెప్పిస్తున్నామని చెప్పారు. ఒక్క వేములవాడ లోనే 60 కిలోల గోల్డ్  ఉందని, ప్రతీ ఆలయ ఆదాయ, వ్యయాలను థర్డ్ పార్టీ తో ఆడిట్  చేయిస్తామని వెల్లడించారు. ఆర్కియాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్  విభాగాల యూనిట్ గా చేస్తేనే.. టెంపుల్ టూరిజం పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా  పురాతన ఆలయాల అభివృద్ధి సాధ్యం కాదని సురేఖ అభిప్రాయపడ్డారు. పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజూ భారీగా దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.