త్రివిధ దళాల సమన్వయంతో భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా తరంగ్శక్తి యుద్ధ విన్యాసాలు ఆగస్టు 6 నుంచి తమిళనాడులోని సూలూరులో జరుగుతున్నాయి. భారత వాయుసేన, ఆర్మీ, నేవీ కలిసి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ విన్యాసాలకు 51 దేశాలకు ఆహ్వానం పంపించగా 30కి పైగా దేశాలు హాజరయ్యాయి.
మొదటి దశ విన్యాసాలు
ఆగస్టు 6 నుంచి 14 వరకు తమిళనాడులో జరిగే ఈ విన్యాసాలకు భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తున్నది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్–29, రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహిస్తున్నది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు జరగనున్నాయి.
భారత త్రివిధ దళాల అధిపతులతోపాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియాకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.