కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే టార్గెట్: విప్ ఆది శ్రీనివాస్

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే టార్గెట్: విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల: రాష్ట్రంలోని కోటి మంది మహిళను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారికత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. 

గతంలో మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పావలా వడ్డీకి రుణాలు మంజూరు, తదుపరి వడ్డీలేని రుణాలను మంజూరు చేశారని గుర్తు చేసిన శ్రీనివాస్.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మహిళలను అభ్యున్నతికి కృషి చేస్తున్నాని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలకు రూ.600 కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తున్నామని, మహిళలకు ఉపాధి కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం వాటిని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. 

ALSO READ | ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని కలిసిన కాంగ్రెస్ లీడర్లు

ఇవాళ (సెప్టెంబర్ 28) రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో రెడ్డీస్ ఫంక్షన్ హాల్‎లో  మెగా జాబ్ మేళా పోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల్లో దాదాపు 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు. 

గతంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, వేములవాడ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించామని.. పట్టణ కేంద్రాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. యువత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు.