చేప పిల్లల పంపిణీలో కిరికిరి

చేప పిల్లల పంపిణీలో కిరికిరి
  • మూడు నెలలు ఆలస్యంగా సీడ్​ పంపిణీ 
  • అసలు లక్ష్యంలో సగం సీడ్​తో ముందుకు​ 
  • చేపల ఎదుగుదల ఉండదనిమత్య్సకారుల వాదన
  • అనుమానాలు వద్దంటున్న ఆఫీసర్లు  

నిజామాబాద్,  వెలుగు:  జిల్లాలోని మత్య్సకారుల ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం నెరవేడంలేదు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం​ ఫిష్​ సీడ్​ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్స్​సరిగా చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి ఈ ఏడాది సీడ్​ సప్లై చేసేందుకు ముందుకు రాలేదు. సర్కారు మారినందున ఇప్పుడలా జరగదని ఆఫీసర్లు వారిని ఒప్పించేసరికి మూడు నెలలు దాటిపోయింది. టార్గెట్​లో సగం చేపలు పెంచి వారికి ఉపాధి కల్పించాలని అధికారులు సీడ్​ సప్లై చేయగా ఇప్పుడు సీడ్​ వేసి ప్రయోజనం లేదని మత్య్సాకార సంఘాలు  అంటున్నాయి. ఫిష్​ సీడ్​ కోసం ఖర్చు చేసే నిధులు సంఘాలకు ఇస్తే మేలని చెబుతున్నారు. 

 రూ.2.05 కోట్లకు తగ్గించి..

జిల్లాలో 396 మత్య్సపారిశ్రామిక సంఘాలుండగా 23,657 మంది సభ్యులున్నారు.  967 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపల పెంపకంతో ఉపాధి పొందుతారు.  ఇందుకు కావాల్సిన ఫిష్​ సీడ్​ను ప్రభుత్వం ఫ్రీగా అందిస్తుంది. మే నెలలో సీడ్​ సరఫరాకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించి జులైలోనే జలాశయాలలో సీడ్​ వేయాలి.  గత బీఆర్​ఎస్​ పాలనలో టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లకు బిల్స్​ రాకపోవడంతో ఈసారి సీడ్​ సప్లయికి ముందుకు రాలేదు.  

కాంగ్రెస్​ ప్రభుత్వం​ సీడ్​ ఫిష్​ కోసం రూ.4.54 కోట్లు కేటాయించి పెంచి  రెండు సార్లు టెండర్లు పిలిచినా రాలేదు. ఆఫీసర్లు ప్రత్యేక చొరవ తీసుకొని  ముగ్గురు కాంట్రాక్టర్లను  ఒప్పించగలిగారు. వర్షాకాలం ముగిసినందున అసలు ప్రణాళికను రూ.2.05 కోట్లకు కుదించారు. ఆ నిధులతో 2.27 కోట్ల చేపపిల్లలను జలాశయాలలో వదలాల్సి ఉండగా పంపిణీ షురూ చేశారు. సీజన్​ ముగిశాక వేసే పిల్లలు పెరుగవని, నిధులను వృథా​ చేసే బదులు మత్య్సకారులకు పంచాలని సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ మేరకు కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతును గత వారం కలిసి వినతి పత్రం అందజేశారు.

వివిధ సైజ్ లలో చేపపిల్లలు

814 చెరువులలో 40 ఎంఎం సైజ్​ సీడ్​ 1.35 కోట్లు, 153 చెరువులలో 92 లక్షల 100 ఎంఎం సైజ్​ పిల్లలు  సప్లయి చేస్తున్నారు. గరిష్ఠంగా 8 నెలల పాటు నీరు నిలువ ఉంటేనే 40 ఎంఎం సీడ్​ పెరుగుతుంది. నీటి నిలువ ఏడాది పాటు ఉండే రిజర్వాయర్లలో 100 ఎంఎం సీడ్​ వదులుతారు. వీటి పర్యవేక్షణకు ఆఫీసర్లు, మత్య్సకారులతో కూడిన మూడు కమిటీలు ఏర్పాటు చేశారు.  

అపోహలు వద్దు

సీడ్​ పంపిణీలో కొంత జాప్యం జరిగిన విషయం నిజమే. దీనికి కారణాలు మత్స్య సంఘాలకు తెలుసు. నవంబర్​ 15 లోగా చేప పిల్లల పంపిణీ ముగిస్తం. చేపలు పెరగవనే అపోహలు వద్దు. రోజుకు ఒక ఎంఎం చొప్పున పిల్లలు పెరిగి ఎనిమిది నెలల్లో కిలో బరువు తూగుతాయి. ట్రాన్స్​పరెంట్​ నీటిలో మాత్రమే ఫిష్​ సీడ్​ పెరగదు. 

జిల్లాలో బ్లాక్​ సాయిల్​ పొటెన్షియల్​ జలాశయాలే ఉన్నాయి. పక్కా పెరుగుతాయి. అనుమానాలు పెట్టుకోవద్దు.  అలుగుల మీదుగా చేపలు బయటపడకుండా చూసుకుంటేచాలు. జిల్లాలో 35 వేల టన్నుల చేపల ఉత్పత్తిని అంచనా వేస్తున్నం.
- ఆంజనేయ స్వామి, ఏడీ ఫిషరీస్​