
న్యూఢిల్లీ: టార్గెట్ పోడియం స్కీమ్ (టాప్స్)లోని కోర్ గ్రూప్‌లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ చోటు నిలబెట్టుకున్నారు. ఇటీవల కాలంలో అథ్లెట్ల ఆటతీరును సమీక్షించిన తర్వాత టాప్స్ కోర్ గ్రూప్‌లోని అథ్లెట్ల సంఖ్యలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారీగా కోత పెట్టింది. ఈ జాబితాను179 నుంచి 94 మందికి తగ్గించింది. పారా అథ్లెట్ల సంఖ్యను 78 నుంచి 42 మందికి కుదించింది. బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గొహైన్‌ను మాత్రమే ఉంచి.. అమిత్ పంగల్, శివ థాపా, నిశాంత్ దేవ్ వంటి స్టార్ ప్లేయర్లను తొలగించింది.
బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టిని కొనసాగించి ఫామ్ కోల్పోయిన కిడాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్పను తప్పించింది. షూటర్ల సంఖ్యను 25 నుంచి 17కు కుదించినా.. స్కీమ్‌లో అత్యధిక మంది వాళ్లే ఉండటం గమనార్హం. గోల్ఫ్, స్విమ్మింగ్, టెన్నిస్‌లో ఒక్కరికి కూడా చోటు ఇవ్వని క్రీడా మంత్రిత్వ శాఖ టేబుల్ టెన్నిస్ నుంచి ఆకుల శ్రీజ, మనిక బత్రాను మాత్రమే తీసుకుంది. 2014లో ప్రారంభమైన టాప్స్‌లో ఉన్న అథ్లెట్లకు విదేశాల్లో ట్రెయినింగ్, కోచింగ్‌తో పాటు నెలకు రూ. 50 వేల స్టైఫండ్ లభిస్తుంది.