సింగరేణి ఆధ్వర్యంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ..సోలార్ విద్యుత్ నిల్వ చేయడమే టార్గెట్: సీఎండీ

సింగరేణి ఆధ్వర్యంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ..సోలార్ విద్యుత్ నిల్వ చేయడమే టార్గెట్: సీఎండీ

 

  • పైలట్ ప్రాజెక్టుగా మెగావాట్ సామర్థ్యంతో మందమర్రిలో ప్లాంట్
  • సక్సెస్​ అయితే మరో 2 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సోలార్ ఎనర్జీ స్టోరేజ్  వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సింగరేణి సిద్ధమైంది. సోలార్  విద్యుత్  ను నిల్వచేసి సద్వినియోగం చేసుకునే వినూత్న ఆవిష్కరణకు సింగరేణి శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్ లో పగటిపూట ఉత్పత్తి చేసిన కరెంటును వాడుకోగా మిగిలిన సోలార్  విద్యుత్ ను వృథా కాకుండా బ్యాటరీలో నిల్వచేసే  ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్  సిస్టం’ ను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తోంది.

ఈ వినూత్న పద్ధతికి సంబంధించిన వివరాలను సంస్థ సీఎండీ ఎన్.బలరామ్​ వెల్లడించారు. సింగరేణి పరిధిలోని మందమర్రి ఏరియాలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ లో  పైలట్ ప్రాజెక్ట్ గా ఎనర్జీ స్టోరేజీ చేపడుతున్నారు. ఒక మెగావాట్  సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్  పద్ధతిలో పవర్  స్టోర్​ చేస్తారు. ఫలితంగా నెలకు రూ.13 లక్షలు చొప్పున ఏటా రూ.1.60 కోట్ల విలువైన  సోలార్  విద్యుత్  వృథా కాకుండా సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే మరో రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన  సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. 

వృధా అరికట్టడానికే ఎనర్జీ స్టోరేజీ 

 సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రిలోని మైన్స్​ కరెంటు అవసరాల కోసం 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను 2021లో  ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్  ద్వారా ఉత్పత్తి అయ్యే సోలార్​ పవర్​ను మందమర్రి, శ్రీరాంపూర్  ఏరియాలోని 11 అండర్​గ్రౌండ్​ మైన్స్, 4 ఓపెన్ కాస్ట్  గనులు, ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ ప్లాంట్ తో రోజుకు సగటున  లక్ష 34 వేల యూనిట్ల విద్యుత్  ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో సుమారు ఒక లక్ష 14 వేల యూనిట్ల విద్యుత్ ను కంపెనీ వినియోగించుకుంటున్నది. ఇది పోగా దాదాపు 20 వేల యూనిట్ల కరెంట్  వృధా అవుతోంది.

దీన్ని స్థానిక సబ్ స్టేషన్  ద్వారా సదరన్​ డిస్కం (టీజీఎన్పీడీసీఎల్) కు ఉచితంగా ఇస్తున్నారు. ఇన్ హౌస్  క్యాప్టివ్  పవర్  ప్లాంట్  ద్వారా ఈ మిగులు విద్యుత్.. రాష్ట్ర విద్యుత్  శాఖ లైన్లలో కలుస్తుంది. కాబట్టి  డిస్కమ్  ఈ కరెంట్ కు ఎలాంటి చార్జీలు చెల్లించడం లేదు. ఇలా ఉచితంగా పోతున్న 20 వేల యూనిట్ల సోలార్  విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్  సిస్టంను  ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఈ సిస్టం ఏర్పాటులో అనుభవం ఉన్న  కాన్పూర్ కు చెందిన మెస్సర్స్ మార్స్ ఇండియా యాంటేనాస్  అండ్ ఆర్ఎఫ్  సిస్టమ్స్ అనే ప్రైవేటు కంపెనీకి స్టోరేజీ సిస్టమ్  ఏర్పాటు పనిని అప్పగించింది. ఒక మెగావాట్  ఏర్పాటుకు దాదాపు రూ.2.50 కోట్లు చొప్పున మూడు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రూ.7.50 కోట్లుగా అంచనా వేస్తున్నరు. కరెంట్​ సద్వినియోగం చేసుకుంటే అయ్యే ఖర్చు రెండేండ్ల లోపే  తీరనుంది. 

 సొంత సోలార్ ప్లాంట్​తో నెలకు రూ.4 కోట్లు ఆదా

మందమర్రి ఏరియాలో సింగరేణి సంస్థ సోలార్  ప్లాంట్  ఏర్పాటు చేయక ముందు శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని  15 గనుల అవసరాలకు నెలకు రూ.13 కోట్ల విలువైన విద్యుత్ ను డిస్కం నుంచి కొనుగోలు చేసేది.  2021 ఏప్రిల్ 17న 28 మెగావాట్ల సోలార్  పవర్ ప్లాంటు ఏర్పాటు చేయడంతో నెలకు రూ.4 కోట్ల ఆదా అవుతోంది.