ఎల్జీబీటీ లే లక్ష్యంగా డ్రగ్స్​ దందా

ఎల్జీబీటీ లే లక్ష్యంగా డ్రగ్స్​ దందా
  • రెగ్యులర్​గా 36 మందికి అమ్మకాలు 
  • నిందితుడు అరెస్ట్, 320 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీనే లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ దందా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీజీ నాబ్, నాంపల్లి పోలీసులు కలిసి శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ కు చెందిన షేక్ అమీర్ అలియాస్ వసీమ్ ఖాన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తనలాంటి వాళ్లకు డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్​చేశాడు. ముంబైకు చెందిన డ్రగ్ పెడ్లర్లు మహ్మద్ సలీ అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ సలీం, రయీస్ అలియాస్ అయాన్ వద్ద డ్రగ్స్ కొని సిటీకి తెస్తున్నాడు. ఆ తర్వాత ఎల్జీబీటీ కమ్యూనిటీలోని సుమారు 36 మందికి రెగ్యులర్​గా ఎండీఎంఏ అమ్ముతున్నాడు. ఈ నెల18న ముంబై నుంచి నాంపల్లికి ఓ ప్రైవేటు బస్సులో వస్తున్న నిందితుడిని టీజీ నాబ్, నాంపల్లి పోలీసులు కలిసి పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 320 గ్రాముల డ్రగ్స్, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహ్మద్ సలీ అబ్దుల్ హమీద్ షేక్ , రయీస్ పరారీలో ఉన్నారు.

ఐకియా వ్యాన్​లో గంజాయి

ఐటీ ఉద్యోగులకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో గచ్చిబౌలిలోని జీహెచ్‌ఎంసీ పార్క్​వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఐకియా డెలివరీ వ్యాన్​ను తనిఖీ చేయగా, అందులో 1.12 కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో వాహనంలోని నాగర్‌కర్నూల్‌కు చెందిన మహేశ్, సిద్ధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.