న్యూఢిల్లీ: జడ్జిలపై విమర్శలు చేయడం ఫ్యాషనైపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్లలో జడ్జిలను టార్గెట్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ధిక్కార కేసులో ఓ అడ్వొకేట్కు 15 రోజుల జైలు శిక్ష విధించిన కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి ఎంత కఠినంగా వ్యవహరిస్తే అతనిపై అంత ఎక్కువ ఆరోపణలు వస్తాయని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
దేశంలో జడ్జిలపై దాడులు పెరిగిపోతుండటంపై జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా జడ్జిలకు కనీస భద్రత లేకుండా పోయిందని, కనీసం ఓ కానిస్టేబుల్ తో కూడా సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితి ఉందని చెప్పారు. సదరు అడ్వకేట్కు 15రోజుల శిక్షను సమర్థించిన ధర్మాసనం..అడ్వకేట్లు కూడా చట్టం దృష్టిలో సమానమేనని అభిప్రాయపడింది. న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగిస్తే వారు సైతం పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది. జడ్జిలపై ఆరోపణలు చేసే ఇలాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకు మాయని మచ్చలాంటి వారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.