
న్యూఢిల్లీ: టారిఫ్ వార్తో ఇండియా ఇన్వెస్టర్లు విపరీతంగా నష్టపోయారు. ఈ నెల ప్రారంభం నుంచి వాళ్ల సంపద రూ.11.30 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ దాదాపు 2 శాతం పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలకు తెరతీయడంతో ఇటీవల స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నెల రెండో తేదీ నుంచి బీఎస్ఈ బెంచ్‌మార్క్ 1,460.18 పాయింట్లు (1.90 శాతం) క్షీణించింది.
ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ కాలంలో రూ.11,30,627.09 కోట్లు తగ్గి రూ.4,01,67,468.51 కోట్లకు ( 4.66 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. గత శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 2 శాతం పెరిగాయి. అమెరికా అదనపు దిగుమతి సుంకాలను 90 రోజులు నిలిపివేయడంతో మార్కెట్లో ర్యాలీ వచ్చింది. అయితే ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కారణంగా మార్కెట్లు రెండుసార్లు మూతపడ్డాయి.
ఏప్రిల్ మొదటి వారంలో ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించినా, తదనంతరం వెనక్కి తగ్గారు. చైనా మినహా చాలా దేశాలకు ప్రతీకార సుంకాలపై 90 రోజుల విరామం ప్రకటించారు. అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలను విధించాలని చైనా నిర్ణయించింది. ట్రంప్ సర్కారు విధించిన 145 శాతం సుంకాలకు ప్రతీకారంగా ఈ చర్యు తీసుకుంది.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే..
"చాలా దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన తర్వాత మన మార్కెట్లు కుప్పకూలాయి. గ్లోబల్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం భారతదేశం పరిస్థితి మెరుగ్గానే ఉంది" అని లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు సతీష్ చంద్ర అలూరి అన్నారు. అమెరికా తమ దేశంలోకి వచ్చే భారతీయ వస్తువులపై అదనంగా 26 శాతం సుంకాన్ని విధిస్తామని ఈ నెల రెండున ప్రకటించింది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గుతున్నట్టు ట్రంప్తొమ్మిదో తేదీన ప్రకటించారు. చాలా దేశాలపై విధించిన 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ కొనసాగుతోంది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల వల్ల తీవ్రమైన నష్టాలు వస్తాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. చైనా మాత్రమే టిట్ -ఫర్- టాట్ లెవీలతో ప్రతీకారం తీర్చుకుంది. ఈ విషయమై మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌లో పరిశోధన, సలహాదారు విష్ణు కాంత్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, ఇప్పుడు గ్లోబల్‌మార్కెట్లలో అనిశ్చితి ఇన్వెస్టర్లను కలవరపెడుతోందని అన్నారు. మార్కెట్ల దిశను ఇదే నిర్ణయిస్తుందని తెలిపారు. కంపెనీల రిజల్ట్స్ బాగుంటే ఇండియన్ మార్కెట్లు కోలుకోవడానికి అవకాశాలు ఉన్నాయని విష్ణు వివరించారు.
ప్రస్తుత అనిశ్చితి దశ మరో మూడు నుంచి ఆరు నెలల వరకు కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యూఎస్ మందగమనం, మాంద్యం భయం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను అణచివేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు సానుకూలంగా మారితే విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలవైపు చూసే అవకాశం ఉందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాగానే ఉందని, ప్రపంచ మార్కెట్ అనిశ్చితులు, అస్థిరతలు, వాణిజ్య అంతరాయాల వల్ల ఇబ్బందులు రావొచ్చని విష్ణు వివరించారు.