
- సెన్సెక్స్ 1,390 పాయింట్లు డౌన్
- 353 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- భారీగా తగ్గిన ఐటీ స్టాక్స్
- ఇన్వెస్టర్లకు రూ. 3.44 లక్షల కోట్లు లాస్
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా టారిఫ్వార్తో కుదేలయ్యాయి. కొన్ని రకాల ఎగుమతులపై బుధవారం నుంచి టారిఫ్‌లు వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేయడంతో ఇండెక్స్‌లు దెబ్బతిన్నాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం సెన్సెక్స్ 1,390 పాయింట్లు పతనమై 76,024.51 వద్ద స్థిరపడింది.
దీనిలోని 28 స్టాక్స్ నష్టపోగా, రెండు మాత్రమే లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఇది 1,502.74 పాయింట్లు (1.94 శాతం) 75,912.18 వద్దకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 353.65 పాయింట్లు (1.50 శాతం) తగ్గి 23,165.70 వద్ద ముగిసింది. దీంతో పెట్టుబడిదారుల సంపద రూ. 3.44 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,44,058.44 కోట్లు తగ్గి రూ. 4,09,43,588.06 కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ ప్యాక్ నుంచి హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టూబ్రో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ భారీగా నష్టపోయాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 5 శాతానికి పైగా పెరిగింది. ప్రతీకార టారిఫ్‌లు అమల్లోకి వస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి పెరిగిందని, ఈ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్‌పైనా పడిందని ఎనలిస్టులు చెప్పారు. అమెరికాపై ఆధారపడ్డ భారత ఐటీ రంగం తీవ్రంగా దెబ్బతిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
మెజారిటీ ఇండెక్స్‌లకు నష్టాలే
జారిటీ ఇండెక్స్‌లకు నష్టాలేఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 1.04 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగింది. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లలో రియల్టీ 3.05 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.51 శాతం, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 2.42 శాతం, ఐటీ 2.24 శాతం, ఆర్థిక సేవలు 1.78 శాతం, టెక్ 1.73 శాతం, బ్యాంకెక్స్ 1.50 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ టెలికం, ఆయిల్ గ్యాస్ లాభపడ్డాయి.
వొడాఫోన్ ఐడియా షేర్లు దాదాపు 19 శాతం పెరిగి రూ. 8.10 వద్ద ముగిశాయి. ప్రభుత్వం రూ. 36,950 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చడంతో కష్టాల్లో ఉన్న టెల్కోలో దాని వాటా 49 శాతానికి చేరుకుంది. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సానుకూలంగా ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం పెరిగాయి.
ఎఫ్ఐఐలు శుక్రవారం రూ. 4,352.82 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. రంజాన్ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.12 శాతం పెరిగి 74.86 డాలర్లకు చేరుకుంది.