ట్రంప్ టారిఫ్​లతో మీపైనే భారం!..అమెరికన్లను ఉద్దేశించి చైనా విదేశాంగ శాఖ ట్వీట్​

ట్రంప్ టారిఫ్​లతో మీపైనే భారం!..అమెరికన్లను ఉద్దేశించి చైనా విదేశాంగ శాఖ ట్వీట్​

బీజింగ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై ప్రకటించిన భారీ టారిఫ్ ల వల్ల ఆయా దేశాలకు వచ్చిన నష్టమేమీ లేదని.. వాస్తవానికి అమెరికన్ ప్రజలపైనే పన్నుల భారం పెరుగుతోందని చైనా హెచ్చరించింది. ఇప్పటివరకూ ట్రంప్ ఎంత టారిఫ్ లు పెంచితే.. తానూ అంత టారిఫ్​లు పెంచుతూ వచ్చిన డ్రాగన్ కంట్రీ తాజాగా రూట్ మార్చింది. ట్రంప్ తీరుతో మీకే నష్టం అంటూ డైరెక్ట్​గా అమెరికన్ ప్రజలకే మెసేజ్ పంపింది.

.టారిఫ్​ల వల్ల విదేశాలకే ఇబ్బంది అవుతుంది కానీ, అమెరికన్లకు నష్టమేమీలేదన్న అభిప్రాయాన్ని తిప్పికొట్టేలా కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఓ వ్యాపారి మాట్లాడిన వీడియోను జతచేస్తూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. తాను ఇంతకుముందు చైనా నుంచి అతి చౌకగా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవాడినని, ఇప్పుడు అవే ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయించాలంటే వందల రెట్లు అధికంగా ఖర్చు అవుతోందంటూ ఆ వ్యాపారి వీడియోలో పేర్కొన్నారు.

‘‘టారిఫ్ లను ఫారిన్ కంట్రీస్ చెల్లిస్తాయని అనుకుంటున్నారా? లేదు. అమెరికన్ కంపెనీలు చెల్లిస్తాయి. తర్వాత ఆ ఖర్చులను మీపై వేస్తాయి. టారిఫ్ లతో మాన్యుఫాక్చరింగ్ రంగం తిరిగి పుంజుకోదు. టారిఫ్ లు అంటే కేవలం అమెరికన్ లపై ట్యాక్స్ లు వేయడమే” అని ఈ వీడియోకు మావో నింగ్ కామెంట్ పెట్టారు. కాగా, చైనాపై అమెరికా ఇప్పటివరకూ 145% టారిఫ్ లను ప్రకటించగా.. ప్రతీకారంగా చైనా 125% టారిఫ్ లను విధించింది. అయితే, చైనా నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై మాత్రం టారిఫ్ లను ట్రంప్ మినహాయించారు.