సికింద్రాబాద్, వెలుగు: తార్నాక జంక్షన్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాహనదారుల ఎనిమిదేండ్ల యూటర్న్ల ఇబ్బందులకు త్వరలో చెక్‌పెట్టనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్అడిషనల్సీపీ విశ్వప్రసాద్, జీహెచ్ఎంసీ జోనల్‌కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులు శుక్రవారం తార్నాక జంక్షన్‌కు ఇరువైపులా ఉన్న రోడ్లను, బస్టాప్ లను, ఫుత్పాత్లను పరిశీలించారు. జంక్షన్ ఓపెన్అయితే యూ-టర్న్‌ల అవసరం ఉండదు. వాహనదారులకు కిలోమీటరు మేర ప్రయాణ భారం తగ్గుతుంది.
బీఆర్ఎస్ హయాంలో క్లోజ్
బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్పేరుతో ఎనిమిదేండ్ల కింద తార్నాక జంక్షన్‌ను మూసి వేశారు. జంక్షన్ సమీపంలో మెట్రో పిల్లర్అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్‌జామ్‌ను నివారించాలని, వాహనాల ఫ్లో సులువుగా ఉంటుందని, ట్రాఫిక్ పోలీసుల అవసరముండబోదంటూ అటు రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో, ఇటు ఐఐసీటీ సమీపంలో యూ-టర్న్‌లను ఏర్పాటు చేశారు. అయితే, ట్రాఫిక్సమస్య తీరకపోగా మరింత ఎక్కువైంది.
రోజూ ఉదయం, సాయంత్రం పీక్అవర్స్లో రెండు వైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభిస్తోంది. గతంలో ఒకరిద్దరు ట్రాఫిక్కానిస్టేబుల్స్ఉన్నచోట నలుగురు కానిస్టేబుల్స్‌ను డ్యూటీ చేయాల్సి వస్తోంది. పైగా యూ-టర్న్‌ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్సిస్టమ్పై పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్విభాగం, ట్రాఫిక్పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్‌ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చేసింది.
చేసే మార్పులివే..
జంక్షన్‌కు సెంటర్లో ఐలాండ్ఏర్పాటుతో పాటు ఇరువైపులా ఆరు మీటర్లున్న ఫుట్‌పాత్‌లను మూడు మీటర్లకు కుదించనున్నారు. దీంతో పాటు జంక్షన్‌కు సమీపంలో రెండు వైపులా ఉన్న బస్టాప్‌లను షిఫ్ట్చేస్తారు. ఇదంతా వారం, పదిహేను రోజుల్లో పూర్తిచేసి జంక్షన్‌నుంచి వాహనాల రాకపోకలు సాగించనున్నారు.
సిటీలో యూటర్న్‌లను తగ్గిస్తాం
నగరంలో మిగిలిన చోట్ల ఉన్న యూటర్న్‌లను ఏ విధంగా మార్చాలో ఆలోచిస్తున్నాం. తార్నాక జంక్షన్ తెరిచాక నగరంలోని మిగతా చోట్ల ఉన్న యూ-టర్న్‌లను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం.
- పి.విశ్వప్రసాద్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ