- బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్
- పైసల పంపిణీ వర్కౌట్ కాకే కొనుగోలు స్క్రిప్ట్‌కు తెరతీశారు
- ఎమ్మెల్యేలను ఎందుకు బయటికి రానిస్తలే
- ప్రజల ముందు కేసీఆర్ ఏదో దాస్తున్నరు
న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంలో కేసీఆర్ ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మునుగోడు నియోజకవర్గంలో మోహరించారని అన్నారు. భారీగా డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ రాజకీయ స్పృహ కలిగిన మునుగోడు ఓటర్లు.. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగరని, ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కేసీఆర్ తెరలేపారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డ్రామాకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను కేసీఆర్ స్వయంగా రాశారని, కానీ ఈ స్టోరీ విఫలమైందన్నారు.
వారిని మీడియా ముందుకు ఎందుకు పంపరు?
కొనుగోళ్ల వ్యవహారంలో ఉన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలను మునుగోడు బహిరంగ సభకు హెలికాప్టర్ లోనే తీసుకువచ్చి, తిరిగి హెలికాప్టర్ లోనే తరలించారని తరుణ్ చుగ్ అన్నారు. ‘‘ముఖ్యమంత్రికి ఎందుకు భయం? ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బయటికి వెళ్లేందుకు, మీడియా ముందుకు రావడానికి ఎందుకు అనుమతించడం లేదు?’’ అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ ప్రజల ముందు ఏదో దాస్తున్నారన్న విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలను తెలంగాణ ప్రజలు నమ్మరని తెలుసుకోకుండా కేసీఆర్ వీడియో, ఆడియో కంటెంట్‌ను రూపొందిస్తూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు.. కేసీఆర్ శిబిరంలో భయాందోళనలకు నిదర్శనమని చెప్పారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ప్రజలు షాక్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు.