బూర నర్సయ్యగౌడ్ తనను కలవలేదని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని, ఎవరు ఎప్పుడైనా తమ పార్టీలో చేరొచ్చన్నారు. నర్సయ్యగౌడ్ చేరికపై తనకు సమాచారం లేదన్నారు. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. అటు బూర నర్సయ్య బీజేపీ పెద్దలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. మునుగోడు టిక్కెట్ ఆశించిన బూర నర్సయ్యగౌడ్ కు టీఆర్ఎస్ షాకిచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్ధిగా అనౌన్స్ చేయడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ మారాలనే ఆలోచనలో నర్సయ్యగౌడ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.