సీడ్ ​మాఫియాపై టాస్క్​ఫోర్స్​ దాడులు

సీడ్ ​మాఫియాపై టాస్క్​ఫోర్స్​ దాడులు
  • 400 క్వింటాళ్లకు పైగా సీడ్స్​ సీజ్ 
  • రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టివేత
  • 33 మందిని అరెస్టు చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: సీడ్​ మాఫియాపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్, అగ్రికల్చర్​ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ టీమ్​లు వారం రోజులుగా పలు జిల్లాల్లోని విత్తన పరిశ్రమలు, ఫర్టిలైజర్ ​షాపులపై దాడులు నిర్వహించాయి. అనుమతిలేని సీడ్​ప్లాంట్లకు తాళాలు వేయడంతో పాటు బ్లాక్​చేసేందుకు స్టాక్​ పెట్టుకున్న సీడ్స్​ను, కల్తీ విత్తనాలను సీజ్​ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 118.29 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గురువారం నిర్వహించిన దాడుల్లో మరో 279 క్వింటాళ్ల వరి సీడ్స్, 1,600కు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు సీజ్ ​చేశారు.

11 జిల్లాల్లో టాస్క్​ఫోర్స్ దాడులు

టాస్క్​ఫోర్స్​ టీమ్​లు వారం రోజులుగా 11 జిల్లాల్లో దాడులు చేశాయి. రూ.రెండు కోట్లకుపైగా విలువైన 118.29 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్​ చేశారు. 

వీటిలో ఎక్కువగా పత్తి విత్తనాలే ఉన్నాయి. ఇందు కు సంబంధించి 33 మందిని అరెస్టు చేశారు. గురువారం వరంగల్, మెదక్, జనగామ జిల్లాల్లో దాడులు కొనసాగాయి.  

    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో 35 క్వింటాళ్ల నిషేధిత హెచ్​టీ కాటన్ సీడ్స్ పట్టుబడ్డాయి. 


నారాయణపేట జిల్లాలో 8.19 క్వింటాళ్లు, మేడ్చల్ జిల్లా శామీర్​పేట్​లో 24 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో 36.48 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కొడంగల్, దౌల్తాబాద్, బషీరాబాద్, యాలాల ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్​ చేశారు. మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, జనగామ​ జిల్లాల్లో టాస్క్​ఫోర్స్​ దాడులు చేపట్టగా భారీగా నకిలీ విత్తనాలు దొరికాయి.  

    మెదక్ జిల్లా మాసాయిపేటలో అనధికారికంగా ఏర్పాటు చేసిన నకిలీ విత్తన పరిశ్రమను గురువారం  అగ్రికల్చర్​ ఆఫీసర్​ ఝాన్సీ సీజ్  చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లైసెన్సులు తీసుకోకుండా ఇండస్ట్రీ పెట్టి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 279 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను సీజ్​ చేసిన ఆఫీసర్లు.. పరిశ్రమకు తాళం వేసి నిర్వాహకులపై కేసు పెట్టారు.  

    వరంగల్ సిటీలో కృత్రిమ కొరత సృష్టిస్తున్న సీడ్స్, ఫర్టిలైజర్స్​ షాపులపై టాస్క్​ ఫోర్స్​ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈనెల 28న వరంగల్​లోని రఘురామ, మేరీమాత, ఉషోదయ, మహాలక్ష్మి సీడ్స్ ఫర్టిలైజర్స్​ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపుల ఓనర్లు యూఎస్​ 7067, సదానంద్, సాంకేత్, నవనీత్, ఆధ్య తదితర కంపెనీల విత్తనాలను బ్లాక్​ చేసి, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేయగా, ఒకే రోజు దాదాపు రూ.4.06 లక్షల విలువైన 471 పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్​ చేశారు.
 
    29న హనుమకొండ జిల్లా నడికుడ మండలం వెంకటేశ్వర్లపల్లిలో మా వెంకటేశ్వర్లపల్లి రైతు డిపో యజమాని ఇంట్లో బ్లాక్​ చేసి నిల్వ ఉంచిన రూ.2.85 లక్షల విలువైన 330 పత్తి విత్తన బ్యాగులను టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు పట్టుకున్నారు. షాప్ ఓనరుపై కేసు నమోదు చేశారు. జిల్లాలో గురువారం కూడా తనిఖీలు కొనసాగాయి.

    జనగామలోని ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ సీతారామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్తీ విత్తనాలు అమ్మినా, విత్తనాలను, ఎరువులను బ్లాక్​ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

    24న టాస్క్​ఫోర్స్ అధికారులు ఆదిలాబాద్​లోని రాంనగర్ కాలనీలో ఓ గోదాంలో తనిఖీలు చేయగా భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. నాసిరకం విత్తనాలకు కలర్ వేసి మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నట్లు అధికారుల దాడుల్లో తెలిసింది. ఈ దాడుల్లో రూ.19.5 లక్షల విలువైన నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని పోలీస్​స్టేషన్ కు తరలించారు. ముగ్గురిని అరెస్టు చేశారు.