- ఉప ఎన్నికలే టార్గెట్‌గా ప్రణీత్‌రావు టీం వర్క్
- ఎలక్షన్ కోడ్ అవకాశంగా రాధాకిషన్‌రావు రెయిడ్స్
- ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్, ఫోన్‌ట్యాపింగ్‌తో అభ్యర్థులపై నిఘా
- మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటపడుతున్నది. రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్లే టార్గెట్‌గా టాస్క్‌ఫోర్స్ టీం పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలే లక్ష్యంగా ఎస్‌ఐబీ ప్రణీత్‌రావు టీమ్ పనిచేసినట్టు స్పెషల్ టీమ్ దర్యాప్తులో వెల్లడైంది. నియోజకవర్గాల్లోని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ నిఘా, ఫోన్ ట్యాపింగ్ ద్వారా అభ్యర్థులు, వారి అనుచరుల కదలికలను గుర్తించినట్టు ఆధారాలు సేకరించారు.
ఈ మేరకు కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి వివరాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సీక్రెట్ డేటా బయటపడకుండా ఉండేందుకే ఎస్‌ఐబీ లాగర్ రూమ్ హార్డ్‌డిస్క్‌లు, రికార్డులను ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు.
ఎస్‌ఐబీ నుంచి సమాచారం..
పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావును స్పెషల్ టీం పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఆయన నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. రాధాకిషన్ రావు టాస్క్‌ఫోర్స్‌లో జాయిన్ అయిన రోజు నుంచి నిర్వహించిన ఆపరేషన్స్ గురించి ఆరా తీస్తున్నారు. టాస్క్ పేరుతో సోదాలు చేసి, స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అవకాశంగా చేసుకుని బై ఎలక్షన్స్ జరిగిన నియోజకవర్గాల్లో అడ్డగోలుగా ఆపరేషన్స్ చేసినట్టు గుర్తించారు. ఇందుకుగాను సిటీ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల నుంచి సమాచారం సేకరించారు. టాస్క్‌ఫోర్స్ పేరుతో అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి ఆపరేషన్స్ చేశారనే డేటా రికార్డ్ చేస్తున్నారు.
ఫోన్ నంబర్స్, లొకేషన్స్ ట్రేస్ చేసి..
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ (ఎస్‌ఓటీ) టీమ్ చీఫ్ ప్రణీత్‌రావు నుంచి రాధాకిషన్ రావుకు ఎలాంటి సమాచారం వచ్చిందనే వివరాలు రాబడుతున్నారు. అభ్యర్థులు వారి అనుచరుల ఫోన్ నంబర్స్, లొకేషన్స్ ఎలా గుర్తించేవారనే కోణంలో రాధాకిషన్ రావును ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. సెర్చ్ ఆపరేషన్స్‌లో హవాలా వ్యాపారుల వివరాల గురించి ఆరా తీసినట్టు సమాచారం. వారి వద్ద సీజ్ చేసిన డబ్బు ఎక్కడికి తరలించారనే వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ప్రణీత్‌రావు సహా నిందితులు అందరూ వినియోగించిన ఫోన్ నంబర్స్ కాల్‌డేటా, వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌ను రిట్రీవ్ చేస్తున్నారు.
రెండో రోజు కస్టడీలో రాధాకిషన్‌రావుకు అస్వస్థత
రెండో రోజు కస్టడీలో రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యాడు. స్పెషల్ టీమ్ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. దీంతో వెంటనే స్థానిక డాక్టర్లను పిలించారు. వైద్యపరీక్షలు నిర్వహించారు. హైబీపీ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. వయస్సురీత్యా పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉండటంతో డాక్టర్ల సూచనలు తీసుకున్నారు. ఒత్తిడికి గురిచేయకుండా ప్రశ్నించేందుకు చర్యలు తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు కానిస్టేబుల్స్!
నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు హోంగార్డులు, నలుగురు కానిస్టేబుల్స్ రికార్డ్‌ను పోలీసులు ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. ఇందులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. మునుగోడు పరిధిలో నిర్వహించిన ఆపరేషన్స్ లో వీరు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. భుజంగరావు, తిరుపతన్న ఆధ్వర్యంలో ఈ ఇద్దరు పనిచేసినట్టు తెలిసింది. మునుగోడు ఎలక్షన్స్ సమయంలో హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సిటీ టాస్క్‌ఫోర్స్, రాచకొండ ఎస్‌ఓటీ, నల్గొండ పోలీసులు నిర్వహించిన సోదాల వివరాలు రాబడుతున్నారు.