బ్రాండెడ్‌‌ సీసాల్లో కల్తీ లిక్కర్‌‌..నల్గొండ జిల్లా యడవల్లిలో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్‌‌ నిర్వాకం

బ్రాండెడ్‌‌ సీసాల్లో కల్తీ లిక్కర్‌‌..నల్గొండ జిల్లా యడవల్లిలో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్‌‌ నిర్వాకం
  • 1,500 లీటర్ల స్పిరిట్‌‌ స్వాధీనం, ఇద్దరు అరెస్ట్‌‌

నల్గొండ, వెలుగు : కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. స్పిరిట్‌‌తో మద్యాన్ని కల్తీ చేసి బ్రాండెడ్‌‌ సీసాల్లో పోసి వైన్స్‌‌, బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కనగల్‌‌ మండలం యడవల్లికి చెందిన బీఆర్‌‌ఎస్‌‌ మండల నాయకుడు భార్గవ్‌‌, గానుగుపల్లిలో పండ్ల వ్యాపారం చేసే రమేశ్‌‌ అనే వ్యక్తి కొంతకాలంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.

స్పిరిట్‌‌తో మద్యాన్ని కల్తీ చేసి బ్రాండెడ్‌‌ సీసాల్లో పోసి అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న నల్గొండ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు బుధవారం యడవల్లిలోని భార్గవ్‌‌ ఇంటిపై దాడి చేసి 1,500 లీటర్ల స్పిరిట్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గానుగుపల్లిలోని రమేశ్‌‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో, చండూరు శివారులోని గుండ్రాంపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంతో పాటు మరో చోట దాడి చేసి భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. భార్గవ్‌‌, రమేశ్‌‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రూ. 1,200 బాటిల్‌‌ రూ. 700లకే..

నిందితులు కల్తీ మద్యం తయారీకి బ్రాండెడ్‌‌ కంపెనీలను ఎంచుకుంటున్నారు. ముందుగా వైన్స్‌‌, బార్ల నుంచి బ్లెండర్స్‌‌ ప్రైడ్‌‌, టీచర్స్, బ్లాక్‌‌ లేబుల్‌‌, జానీవాకర్‌‌, బ్లాక్‌‌డాగ్‌‌ వంటి ఖరీదైన బాటిళ్లను సేకరిస్తున్నారు. వాటిల్లో కొంత మేర మద్యాన్ని తీసి ఆ ప్లేస్‌‌ను కర్నాటక నుంచి తెప్పించిన ఆర్డినరీ లిక్కర్‌‌తో నింపేస్తున్నారు. కలర్‌‌లో తేడా రాకుండా వాటర్‌‌, స్పిరిట్‌‌ మిక్స్‌‌ చేస్తున్నారు. బాటిళ్లపై మూతలను తొలగించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్స్‌‌పర్ట్స్‌‌ను తీసుకొచ్చి వారికి రోజుకు 8 గంటల పాటు పని కల్పిస్తున్నారు.

మూతలు తొలగించినందుకు వారికి భారీ మొత్తంలోనే చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని చండూరు, నాంపల్లి, మునుగోడు ప్రాంతాల్లోని వైన్స్‌‌, బెల్ట్‌‌షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. రూ.1,200 విలువైన బాటిల్‌‌ను రూ. 700కు, రూ. 2 వేలు ఖరీదు చేసే బాటిల్‌‌ను రూ.1,200 కే ఇస్తుండడంతో లిక్కర్‌‌ వ్యాపారులు, బెల్ట్‌‌ షాప్‌‌ నిర్వాహకులు ఈ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దందాకు పాల్పడుతున్న నిందితులకు కొందరు వ్యాపారులు, బెల్టుషాప్‌‌ల నిర్వాహకులు సైతం సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇద్దరి పేర్లు తప్ప తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో పోలీసులు బయటపెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.