ఆదిలాబాద్‌ జిల్లాలో రంగులు వేసి విత్తనాల అమ్మకాలు

  • టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో నకిలీ విత్తనాలు వెలుగులోకి

ఆదిలాబాద్, వెలుగు : పట్టణంలోని ఓ గోదామ్​లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు శుక్రవారం దాడులు  నిర్వహించి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలోని  ఓ గోదాంలో    నాసిరకం విత్తనాలకు కలర్ వేసి మార్కెట్లో అమ్ముతున్నట్టు  అధికారులకు సమాచారం అందింది. దీంతో వ్యవసాయ శాఖ‍అధికారి పుల్లయ్య, డీఏస్పీ జీవన్ రెడ్డి, ఏఓ  రమేశ్  ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో దాదాపు రూ. 19.5 లక్షల విలువైన  చేసే 400 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు. 

రెండు కంపెనీలకు చెందిన నాలుగు వెరైటీ రకం నకిలీ విత్తనాలను తయారు చేసి, అమ్ముతున్నారు.  లూస్ విత్తనాలను కలర్ వేసి ప్యాకెట్లలో నింపి ఆదిలాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. పలు బ్రాండేడ్ కంపెనీల పేరుతో ఉన్న ప్యాకెట్లలో కలర్ వేసిన విత్తనాలను నింపి విక్రయాలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు.  ప్రధాన నిందితుడు అశోక్ రెడ్డి,  రాజేందర్ ను అరెస్ట్​ చేశారు.  కాపర్తి మణికంఠ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  

విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్త 

బజార్హత్నూర్ :  రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు  జాగ్రత్తలు వహించాలని ఏఈఓ కృష్ణపాల్ సింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మోహద గ్రామంలో  రైతులకు అవగాహన  కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమకు  సమాచారం అందించాలని అన్నారు. తొందరపడి విత్తనాలను ఇప్పుడే విత్తుకోవద్దని, అనుకూలమైన వర్షాలు కురిసిన తర్వాత విత్తుకోవాలని అన్నారు .   గుర్తింపు పొందిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని చెప్పారు.