కరీంన‌గ‌ర్‌లో న‌కిలీ ఆఫీస‌ర్ అరెస్ట్.. రూ. కోట్లలో మోసాలు

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసగాడిని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సౌత్ ఇండియా సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్ గా చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన రమేశ్ అనే మోస‌గాడి వివ‌రాల‌ను సీపీ కమలాసన్ రెడ్డి బుధ‌వారం మీడియాకు తెలిపారు .

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ కు చెందిన ర‌మేష్ అనే వ్యక్తి.. వ‌రంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ జడ్జి తనకు విజిలెన్సు ఆఫీసర్ గా నియామక పత్రం ఇచ్చినట్లుగా ఫేక్ ఆర్డర్ క్రియేట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అరుదుగా ఉండే అత్యున్నత పోస్ట్ తనదని చెప్పుకు తిరుగుతూ.. అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌ని అన్నారు.

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో సివిల్ పంచాయతీలు పరిష్కరించేందుకు ఓ ఆఫీస్ కూడా తెరిచి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడ్డాడ‌ని సీపీ వెల్ల‌డించారు.గోదావరిఖనికి చెందిన ఓ సింగరేణి కార్మికుని కొడుకుతోపాటు, పలువురుకి ఉద్యోగాలు ఇప్పిస్తానని 40 లక్షల రూపాయలు వసూలు చేసిన ర‌మేష్… అప్పుల రూపంలో మరో నాలుగు కోట్ల దాకా వసూలు చేశాడని తెలిపారు.

వరంగల్ డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ జ్యుడీషియల్ విజిలెన్స్ ఆఫీసర్ గా నమ్మించేందుకు త‌న‌ రెండు కార్లపై జ్యుడీషియల్ శాఖకు సంబంధించిన స్టిక్కర్లు అంటించి షికార్లు చేసేవాడని చెప్పారు. బుధ‌వారం అత‌న్ని అదుపులోకి తీసుకొని , అత‌డి నుంచి ఫేక్ డాక్యుమెంట్లు, జడ్జి పేరుతో తయారు చేసిన నకిలీ ఉత్తర్వు ఆర్డర్, ఐడీ కార్డులు, 2 కార్లు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు సీపీ క‌మ‌లాస‌న్ రెడ్డి వెల్ల‌డించారు.