1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంట్లో నిల్వచేసిన 1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్​లోని ముక్కెర మల్లయ్య ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచి, వాటిని అమ్మకానికి తరలిస్తున్నారని సిద్దిపేట జిల్లా టాస్క్​ఫోర్స్​ పోలీసులకు శనివారం సమాచారం అందింది. హుస్నాబాద్​ పోలీసులతో కలిసి మల్లయ్య ఇంట్లో రైడ్​చేయగా, 29 సంచుల్లో నిల్వ చేసిన 1,450 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి.

ఒక్కో బ్యాగులో 50 కేజీలు నింపి తరలించేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. వాటి విలువ రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హనుమకొండ జిల్లా వేలేరుకు చెందిన పిండి సురేశ్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన సతీశ్ కలిసి నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలతోపాటు ఇతర జిల్లాల్లోని రైతులకు అంటగడుతున్నారని తెలిసింది. వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు నిల్వచేసినట్లు, అమ్ముతున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లకు(8712667447; 8712667446)కు సమాచారం ఇవ్వాలని కోరారు.