
సికింద్రాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని.. అదేనండీ మన జంట నగరాల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి నిల్వ ఉంచిన ఆహారాన్ని, ఆహార పదార్థాలను ఫ్రెష్వని చెప్పి వడ్డిస్తున్న ఒక మండీ రెస్టారెంట్ బాగోతం సికింద్రాబాద్ పరిధిలోని సైనిక్పురిలో బయటపడింది. సైనిక్పురి అరేబియన్ మండీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఎగ్ మయోనైజ్‌ను కూడా వాడుతున్నట్లు గుర్తించారు.
మెరినేట్ చేసిన15 కిలోల చికెన్ను వారం రోజుల నుంచి రెస్టారెంట్ నిర్వాహకులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడింది. ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు కూడా తేలింది. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, కిచెన్, ఫ్రిడ్జ్లో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. వంట నూనెను వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతున్నారని సికింద్రాబాద్ సైనిక్ పురిలోని అరేబియన్ మండీ రెస్టారెంట్కు అధికారులు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల వ్యవధిలోనే మండీ కల్చర్ బాగా పాపులర్ అయింది. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతంలో ఒకప్పుడు ఇది బాగా పాపులర్. కాగా.. ఇప్పుడు నగరవ్యాప్తంగా భోజన ప్రియులు మండీలకు క్యూ కడుతున్నారు. వీకెండ్ వచ్చిదంటే చాలు హైదరాబాద్లోని మండీలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. మండీ రెస్టారెంట్లకు కూడా కాంపిటేషన్ బాగా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. దీంతో కొత్తగా పబ్లిక్ ని ఆకట్టుకునేలా కొత్త కొత్త మండీలు పుట్టుకొస్తున్నాయి.
ALSO READ : హైదరాబాద్లో ఒకేసారి రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు.. భయాందోళనలతో పరుగులు తీసిన ప్రజలు
సౌదీ అరేబియా, ఒమన్, సోమాలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో మండీ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబసభ్యులతో లేదా స్నేహితులతో కలిసి గ్రూప్గా వెళ్లి మండీ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చినప్పుడు అందరికీ కలిపి ఒక ఎత్తుపీటపై ఒకే కంచంలో చికెన్, మటన్‌తో చేసిన ఆ స్పెషల్ బిర్యానీ వడ్డిస్తారు. ఇలా మండీల పేరుతో ఒక పెద్ద కంచానికి రూ.1800 నుంచి రూ.2000 వరకూ బిల్లు వేసే కొన్ని మండీ రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి. ఇలాంటి మండీలు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు.