- టైర్ పగిలి విరిగిన స్టీరింగ్ రాడ్
- ఏడుగురికి గాయాలు
ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోని సురారం పరిధి గుడిబండపల్లి క్రాస్‌వద్ద సోమవారం మధ్యాహ్నం వేములవాడకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. టైర్ పగలడంతో ప్రమాదం జరగ్గా ఏడుగురు గాయపడ్డారు. నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన వల్లోజు లక్ష్మయ్య, సరోజన, హనుమకొండలో ఉంటున్న వీరి కుటుంబసభ్యులు వల్లోజు రవి, వల్లోజు శోభారాణి, వల్లోజు నర్సింహ, అఖిల, అనిరుధ్, సత్రపోలు శ్రీనివాస్, రజిత, ఇసాంతు కలిసి సిరిసిల్ల జిల్లా
వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరారు. పరకాలలోని తెనుపుల గట్టయ్యకు చెందిన టాటా మ్యాజిక్ (ప్యాసింజర్ ఆటో) వాహనాన్ని కిరాయికి తీసుకున్నారు. హనుమకొండ నుంచి బయల్దేరి ఎల్కతుర్తి దాటగానే సూరారం శివారులోని గుడిబండపల్లి వద్ద వాహనం ముందు టైరు పగిలి, స్టీరింగ్ రాడ్ విరిగింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది.
ఈ యాక్సిడెంట్లో రవి, శ్రీనివాస్, శోభారాణి, లక్ష్మయ్య, సరోజన, అఖిలతో పాటు డ్రైవర్ గట్టయ్య గాయపడ్డారు. వీరిని108లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఎస్సై గోదారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదన్నారు. బాధితులు మరో ఆటో మాట్లాడుకొని హనుమకొండ వెళ్లిపోయారు.