IPO News: టాటాల నుంచి రూ.15వేల కోట్ల ఐపీవో.. బెట్ వేసేందుకు గెట్ రెడీ!

IPO News: టాటాల నుంచి రూ.15వేల కోట్ల ఐపీవో.. బెట్ వేసేందుకు గెట్ రెడీ!

Tata Capital IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో గడచిన కొన్ని వారాలుగా ఐపీవోల కోలాహలం మూగబోయింది. మార్కెట్ల ఒడిదొడుకులతో అనేక కంపెనీలు తమ ఐపీవో ప్లాన్లను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కొత్తగా రానున్న ఐపీవోలపై తమ గురి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ నుంచి మరో కొత్త ఐపీవో రాబోతోందనే వార్త ఇన్వెస్టర్లలో సంతోషాన్ని నింపుతోంది. చాలా మంది దీనిపై బెట్టింగ్ వేసేందుకు డబ్బు సిద్ధం చేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే టాటాలకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ వ్యాపార సంస్థ టాటా క్యాపిటల్ కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ మార్గంలో కంపెనీ ఐపీవోను తీసుకురావటానికి ప్రయత్నాలను ముమ్మరం చేసిందని వెల్లడైంది. దీని కింద సెబీ వద్ద టాటా గ్రూప్ తన ఐపీవో ప్రణాళిక దరఖాస్తున్న గోప్యంగా అందించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ పూర్తిగా ఈ విషయాన్ని ప్రకటించే వరకు అధికారికంగా ప్రకటన చేయదని అర్థం. దీంతో టాటా ప్లే, ఓయో, స్విగ్గీ, విశాల్ మెగామార్ట్, క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇందిరా ఐవీఎఫ్, ఫిసిక్‌వాలా కంపెనీల తర్వాత ఈ మార్గంలో ఐపీవో తీసుకొస్తున్న కంపెనీగా టాటా క్యాపిటల్ నిలిచింది.

రిజర్వు బ్యాంక్ గతంలో నిర్థేశించిన రూల్స్ కి అనుగుణంగా టాటా సన్స్ నేతృత్వంలో కొనసాగుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని ఐపీవోగా ఫ్లోట్ చేసేందుకు టాటా బోర్డ్ అంగీకారం తెలిపింది. అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీ సంస్థలకు రిజర్వు బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం టాటా గ్రూప్ నుంచి ఈ ఐపీవో వస్తోంది. టాటా క్యాపిటల్ ప్రస్తుతం తీసుకొస్తున్న ఐపీవో విలువ రూ.15వేల కోట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకున్నట్లు వెల్లడైంది. 

ప్రస్తుతం టాటా క్యాపిటల్ కంపెనీలో 92.83 శాతం వాటాలను టాటా సన్స్ హోల్డ్ చేస్తుండగా.. మిగిలిన వాటాను ఇతర టాటా గ్రూప్ సంస్థలు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ హోల్డ్ చేస్తున్నాయి. అలాగే ఐపీవో ప్రారంభానికి ముందు రూ.వెయ్యి504 కోట్లు సేకరించడానికి టాటా క్యాపిటల్ బోర్డు ఫిబ్రవరిలో రైట్స్ ఇష్యూకు కూడా ఆమోదం తెలిపింది. రైట్స్ ఇష్యూలో మొత్తం భాగానికి టాటా సన్స్ సబ్‌స్క్రైబ్ చేస్తుందని వెల్లడించింది. దీంతో పెట్టుబడిదారులు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.