న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన అన్‌లిస్టెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు మస్తు లాభాలు పొందాయి. టాటా క్యాపిటల్ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.13,309 కోట్ల రెవెన్యూపై రూ.2,492 కోట్ల ప్రాఫిట్ సాధించింది. జాయింట్ వెంచర్ కంపెనీలు టాటా ఏఐఏ జనరల్ ఇన్సూరెన్స్ రూ.685 కోట్ల ప్రాఫిట్ పొందగా, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.1,313.84 కోట్ల ప్రాఫిట్ ప్రకటించింది. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లో టాటా సన్స్‌కు 74 శాతం వాటా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51 శాతం వాటా ఉంది. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోపు టాటా క్యాపిటల్‌ను మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలని టాటా గ్రూప్ చూస్తోంది.
సబ్సిడరీ కంపెనీలు టాటా క్లీన్‌టెక్ క్యాపిటల్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్‌లు టాటా క్యాపిటల్ లిమిటెడ్‌లో విలీనమైన విషయం తెలిసిందే. టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను కూడా టాటా క్యాపిటల్‌లో విలీనం చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకున్నారు. టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్ హోల్డర్లకు విలీన సంస్థ టాటా క్యాపిటల్ లిమిటెడ్ షేర్లను ఇష్యూ చేస్తారు. మరోవైపు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్, ఎమెర్జింగ్ టెక్ బిజినెస్‌లు నష్టాల్లో ఉన్నాయి.