కవర్ స్టోరీ :​ మహానుభావుడు రతన్​ టాటా లైప్ జర్నీ

కవర్ స్టోరీ :​ మహానుభావుడు రతన్​ టాటా లైప్ జర్నీ

రతన్​ టాటా గురించి ఒకటి, రెండు, మూడు, నాలుగు అంటూ కొన్ని విషయాలు చెప్పుకుంటే సరిపోదు. ఆయన గురించి తెలుసుకుంటూ పోతుంటే ఊటకు మల్లే విషయాలు ఊరుతూనే ఉంటాయి. ఆ విషయాల ఊట నుంచి కొన్నింటి సమాహారమే ఈ వారం కవర్​ స్టోరీ.

ముంబయిలోని నవల్​ టాటా, సూనీ టాటా దంపతులకు డిసెంబర్ 28, 1937లో రతన్​ జన్మించాడు. రతన్‌‌‌‌ పదేండ్ల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆయనకు18 ఏండ్ల వయసులో తండ్రి సిమోన్ దూనోయర్‌‌ అనే ఒక స్విస్ మహిళను పెండ్లి చేసుకున్నాడు. మరోవైపు, విడాకులు తీసుకున్నాక తల్లి సర్ జంషెడ్జీ జీజీభాయ్‌‌ను పెండ్లి చేసుకుంది. దాంతో రతన్‌‌ను ఆయన నానమ్మ  నవాజ్‌‌బాయి టాటా పెంచారు. రతన్​ టాటాను ఆయన నానమ్మ ముంబయిలోని క్యాంపియన్ స్కూల్​లో చేర్పించారు. 

టాటా ఫ్యామిలీ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టడం అదే తొలిసారి. కూపరేజ్ రోడ్ ఏరియాలో ఉన్న ఆ స్కూల్​ దగ్గర్లో సాకర్ స్టేడియం ఉండేది. కానీ, రతన్​కు మాత్రం ఆటలంటే ఆసక్తి ఉండేది కాదు. రతన్​, ఆయన సోదరుడిని స్కూల్​ నుంచి ఇంటికి తీసుకురావడానికి వాళ్ల నానమ్మ పాత రోల్స్ రాయిస్​ కారు పంపేది. దాంట్లో ఎక్కడానికి సిగ్గుగా అనిపించి ఇంటికి నడుచుకుంటూనే వెళ్లేవారట. ‘‘మా జీవితంలో మేం ఆడుకున్నట్టు నాకు గుర్తున్న ఒకే ఒక ఆట ‘నడిచి వెళ్లడం’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రతన్ టాటా​. కొన్నాళ్లు స్కూల్​కు కొంచెం దూరం కారులో వెళ్లి అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ వెళ్లేవారట. 

చిన్నప్పటి నుంచే అవమానాలు

రతన్, తమ్ముడు జిమ్మీ చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. విడాకులంటే అప్పట్లో మామూలు విషయం కాదు. అందుకని తోటి ఫ్రెండ్స్ వాళ్లను ర్యాగింగ్ చేసేవాళ్లు. తల్లి మరో పెండ్లి చేసుకోగానే సూటిపోటి మాటలు బాగా పెరిగాయి. ‘‘అలాంటి స్థితిలోనూ ధైర్యంగా ఉండడం నేర్పింది నానమ్మ. అలాంటివి పట్టించుకుని... టైం వేస్ట్ చేసుకునే బదులు వాటి నుంచి దూరంగా వెళ్లిపోవడం బెటర్ అనిపించింది. నానమ్మ లేకుంటే నేనిలా ఉండేవాడినే కాదు’’ అని ఓ సందర్భంలో రతన్ టాటా చెప్పారు.

ప్రశ్నించొచ్చని..

క్యాంపియన్​లో చదివేటప్పుడు రతన్​కు ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్​ ఉండేది. కారణం ఫిజిక్స్​ సబ్జెక్ట్​ అయితే ఎంత పెద్ద ప్రశ్న అయినా అడగొచ్చు. కెమిస్ట్రీలో ఆ ఛాన్స్​ లేదనేది ఆయన అభిప్రాయం. క్యాంపియన్​లో సరైన వసతులు లేకపోవడంతో తర్వాత రతన్, ఆయన ఫ్రెండ్స్ ‘కేథడ్రల్ అండ్ జాన్​ కేనన్’​ అనే స్కూల్లో చేరారు. ఇండియాలోని ధనవంతుల పిల్లలంతా అక్కడే చదివేవాళ్లు. 

అయితే, చదువుకునే రోజుల్లో అందరి ముందూ మాట్లాడాలంటే రతన్​ భయపడేవారట. అందుకే కాబోలు స్కూల్లో జరిగే డిబేట్స్, కల్చరల్ యాక్టివిటీల్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. ఒకానొక టైంలో ‘‘నేను అసలు గ్రాడ్యుయేషన్​ పూర్తి చేస్తానా?’’ అనే డౌట్​ కూడా వచ్చిందట. స్కూల్లో లెక్కల టీచర్​ కూడా అదే అనుకొని ఉంటారని చెప్పారు. తర్వాత సిమ్లాలోని బిషప్​ కాటన్ స్కూల్లో చదివారు.

అమెరికాలో ఆర్కిటెక్చర్

న్యూయార్క్​లోని రివర్​డేల్​ కంట్రీ స్కూల్​లో 1955వ సంవత్సరంలో డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత1962లో కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్​ పట్టా అందుకున్నారు. అయితే ఈ విషయంలో రతన్​కు, అతని తండ్రికి భిన్నాభిప్రాయాలు ఉండేవి. రతన్​ ఆమెరికాలో చదవాలనుకుంటే తండ్రి యూకే అని పట్టుబట్టారట. ఆర్కిటెక్ట్ కావాలనుకుంటే ఇంజినీర్ అవ్వమన్నారు. ఇక్కడ కూడా నానమ్మ లేకపోతే అమెరికా వెళ్లేవాడిని కాదని ఒకసారి గుర్తు చేసుకున్నారు. ‘‘నానమ్మ వల్ల సబ్జెక్ట్స్​ మార్చుకుని ఆర్కిటెక్చర్​ డిగ్రీ చేశా. కానీ, అది నాన్నకు కోపం తెప్పించింది. కానీ, సొంత వ్యక్తిత్వంతో నిలబడ్డాననే ఫీలింగ్ నాకు తృప్తినిచ్చింది. నచ్చకపోతే ధైర్యంగా, సౌమ్యంగా కూడా చెప్పొచ్చని ఆమె దగ్గరే నేర్చుకున్నా’’ అని చెప్పారు రతన్​ టాటా. 

ఆమె కోసమే.. 

ఆ తర్వాత1975లో మసాచుసెట్స్​​లోని హార్వర్డ్​ బిజినెస్​ స్కూల్లో చేరి అడ్వాన్స్​డ్​​ మేనేజ్​మెంట్ కోర్సు పూర్తి చేశారు. ఆ టైంలోనే కారు డ్రైవింగ్, హెలికాప్టర్​ నడపడం నేర్చుకున్నారు. అప్పుడు అనుకోని అనుభవాలు కూడా ఎదురయ్యాయి. విమానం నడిపేటప్పుడు ఇంజిన్ సమస్య వచ్చింది. అలా రెండు సార్లు జరిగింది. మరోసారి హెలికాప్టర్ నడిపేటప్పుడు ఇంజిన్ పాడైంది. అలా అమెరికాలో ఏడేళ్లు గడిచిపోయింది. లాస్ ఏంజెలిస్‌‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడే సొంత ఇల్లు ఉండేది. అక్కడి నుంచి ఇండియా రావాలనే ఆలోచనే లేదు. కానీ, నానమ్మ నవాజ్​ బాయి​ అనారోగ్యంతో ఉండి తనని ఇండియాకు తిరిగి రమ్మని అడిగారు. దాంతో ఆమె మీదున్న ప్రేమ వల్ల ఇండియాకి వచ్చారు రతన్. 

భారత్​కి వచ్చాక ఖాళీగా..

నానమ్మ ఆరోగ్యం చాలాకాలం బాగుండకపోవడంతో రతన్​ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆమె కన్నుమూసేవరకు నానమ్మతో కబుర్లు చెప్పడం, కుక్కతో ఆడుకోవడం ఇవే ఆయన డైలీ రొటీన్‌. ఆమె చనిపోయాక టాటామోటార్స్​లో చేరారు. అన్నింటి మీదా అవగాహన రావాలని ఆయన్ని ఒక డిపార్ట్​మెంట్ నుంచి మరోదానికి పంపేవారట. టాటా స్టీల్​కు వెళ్లాక తనకంటూ ఒక పని కుదిరింది. దానిపై ఇష్టం పెరిగింది. అక్కడ పనిచేసేవాళ్లు ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత బిజినెస్​లో ఆయనకు ఎదురైన ఛాలెంజె​స్​.. ఆయన్ని ఇండియాలోనే ఉండేలా చేశాయి.  

రతన్​ టాటా పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేసుకునేవారు కాదు. అయితే సిమీ గరేవాల్ చేసిన ర్యాండీవూ ఇంటర్వ్యూలో ఆయన తన గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘భార్య, కుటుంబం.... ఇలా ఎవరూ లేరని చాలాసార్లు ఒంటరిగా ఫీలయ్యాను. పెండ్లి చేసుకోనందుకు బాధగా ఉండేది” అని చెప్పారు.
‘‘నాలుగుసార్లు నేను ప్రేమలో పడ్డాను. అవి పెండ్లి వరకు వచ్చాయి. ప్రతిసారీ ఏదో ఒక భయం లేదా  కారణంతో పెండ్లివరకు వెళ్లకుండా ఆగిపోయా” అని చెప్పారు. అలా జీవితాంతం పెండ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. తల్లిదండ్రులు విడిపోవడం వల్లే రతన్​ పెండ్లికి దూరంగా ఉండి ఉండొచ్చని సన్నిహితులు చెప్తుంటారు. 

అసిస్టెంట్లు కూడా లేరు! 

ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులతో1992లో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో భాగంగా ‘‘ఢిల్లీ నుంచి ముంబయికి జర్నీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక ప్రయాణికుడి గురించి చెప్పండి” అని అడిగారు. అప్పుడు ఎక్కువ ఓట్లు రతన్ టాటాకు వచ్చాయి. ఆయనకు ఓటు వేసేందుకు కారణమేంటి అని అడిగితే.. ‘‘వీఐపీల్లో ఆయన ఒక్కరు మాత్రమే ఒంటరిగా ప్రయాణించేవార’’ని చెప్పారు. 

ఇక్కడ ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే సాధారణంగా వీఐపీలు వాళ్ల బ్యాగ్, ఫైల్స్ మోసేందుకు పక్కన ఒక అసిస్టెంట్​ను పెట్టుకుంటారు. కానీ రతన్ టాటాకు అసిస్టెంట్లు ఎవరూ ఉండేవారు కాదు. విమానంలో ఆయన సైలెంట్​గా తన పని తాను చేసుకుంటుండేవారు. ఆ టైంలో తక్కువ చక్కెర వేసిన బ్లాక్ కాఫీ తాగడం ఆయనకు అలవాటు. తాను అడిగినట్టుగా కాఫీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడూ ఫ్లయిట్ అటెండెంట్లపై కోపం చూపించలేదు” అని చెప్పారు.

టాటా సన్స్ కంపెనీకి చీఫ్‌‌గా ఉన్నప్పుడు, ఆయన జేఆర్డీ టాటా గదిలో కూర్చోలేదు. ఆయన కూర్చునేందుకు సాధారణంగా ఉండే ఒక చిన్న గదిని కట్టారు. ఆయన జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు సీనియర్ అధికారి ఎవరైనా వస్తే... ‘కాసేపు ఆగి.. రండి’ అని ఆ సీనియర్‌‌ అధికారికి చెప్పేవారు. ఆయన దగ్గర రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఉండేవి. వాటి పేర్లు టీటో, ట్యాంగో. అవంటే ఆయనకు చాలా ఇష్టం” అని టాటా గ్రూప్ మీద గిరీష్ కుబేర్ రాసిన పుస్తకం “ది టాటాస్: హౌ ఏ ఫ్యామిలీ బిల్ట్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషన్”లో రాశారు.

పెట్​ లవ్​​

రతన్​ టాటా పెట్​ లవ్​ గురించి చెప్పాలంటే... ఆయన వెళ్లే అన్ని మీటింగ్స్​, బిజినెస్​ వ్యవహారాలకు తను పెంచుకునే శునకాన్ని వెంట తీసుకెళ్లేవారు. ఆయన మీటింగ్​ కంపానియన్​ అసిస్టెంట్, సెక్రటరీ లేదా ఏదో ఒక డిపార్ట్​మెంట్​ హెడ్​ కాదు తనకి ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం ‘గోవా’. ఈ గోవా రోజంతా ఆయనతోనే ఉంటుంది. అలాగే ఆయన మనసులో వీధి కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ముంబయిలోని టాటాగ్రూప్​ గ్లోబల్​ హెడ్​ క్వార్టర్స్​లో వాటికోసం ప్రత్యేకంగా ఒక ప్లేస్​ కేటాయించారు.

కుక్క కోసం అవార్డు ఫంక్షన్​ మిస్​!

ఆయన పెంచుకునే కుక్కలతోపాటు రతన్ టాటా తరచూ బాంబే హౌస్ (టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం) లాబీలో తిరుగుతూ కనిపించేవారు. ఆ టైంలో ముందే అపాయింట్‌‌మెంట్ తీసుకుంటే తప్ప ఆయన్ను కలవడానికి ఎవరినీ అనుమతించేవారు కాదు. ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత సుహేల్ సేథ్ ఒక విషయం చెప్పారు. 2018 ఫిబ్రవరి 6న బకింగ్​హామ్ ప్యాలెస్‌‌లో రతన్ టాటాకు ‘రాక్‌‌ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్‌‌టైమ్ అచీవ్‌‌మెంట్’ అవార్డు బహూకరణ ఉంది.

 ఆ అవార్డును బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ చేతులు మీదుగా అందుకోవాలి. ఆ సెర్మనీకి వెళ్లకుండా ‘‘నా పెంపుడు కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసింది. అందువల్ల నేను అక్కడికి రాలేను” అని ఆ వేడుక జరగడానికి కొన్ని గంటల ముందు ఆ కార్యక్రమ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు రతన్ టాటా. ప్రిన్స్ చార్లెస్‌‌కు ఆ విషయం చెప్పగానే ఆయన ‘‘దట్స్ ఎ మ్యాన్. దట్ ఈజ్ ద మ్యాన్ రతన్ ఈజ్’’ అన్నారట.

టైంకి ఇంపార్టెన్స్ 

జేఆర్డీ టాటా లాగే రతన్ టాటా టైం మేనేజ్​మెంట్​కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సరిగ్గా సాయంత్రం ఆరున్నర గంటలకు తన ఆఫీసు నుంచి వెళ్లిపోయేవారు. ఆఫీసుకు సంబంధించిన పని కోసం ఎవరైనా తనను ఇంట్లో కలవాలనుకుంటే చిరాకుపడేవారు. ఇంట్లో ఏకాంతంగా డాక్యుమెంట్స్ వంటివి చదువుతుండేవారు. ఆయన ముంబయిలో ఉన్నప్పుడు వీకెండ్స్​లో  అలీబాగ్‌‌లోని తన ఫాంహౌస్‌‌లో గడిపేవారు. అప్పుడు ఆయనతో కుక్కలు తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. ట్రావెలింగ్​ చేయడం, స్పీచ్​లు ఇవ్వడం వంటివి పెద్దగా నచ్చవు. ఆడంబరాలకు ఆమడ దూరం ఉంటారాయన.

‘టాటా’ పేరు భారంగా..

రతన్ టాటా యువకుడుగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్న ఆయన స్నేహితులు టాటా గ్రూప్‌‌లో అడుగుపెట్టిన తొలి రోజుల్లో రతన్‌‌ తన ఇంటిపేరు ‘టాటా’ను ఒక భారంలా అనుకునేవారని చెప్తారు. అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో క్లాస్‌‌మేట్స్‌‌‌‌కు తన కుటుంబ నేపథ్యం గురించి తెలియనీయలేదు. అందుకే ఆయన హ్యాపీగా ఉండేవారు. రతన్​ టాటాకి ఉన్న ‘మొండి’ స్వభావం ఆ కుటుంబంలోనే ఉంది. జేఆర్డీ, ఆయన తండ్రి నావల్ టాటాల నుంచి రతన్‌‌కు అది వారసత్వంగా వచ్చిందని ఆయన్ని దగ్గరగా చూసినవాళ్లు చెప్తుంటారు. “ఆయన తలకు తుపాకీ గురిపెట్టినా ‘నన్ను కాల్చండి. కానీ, నేను నా దారిలోంచి పక్కకు వెళ్లను’ అంటారాయన. రతన్ టాటా అలాంటివారు” అంటారు సుహేల్ సేథ్ చెప్పారు. 

అయితే రతన్ ఛైర్మన్ అయ్యాక చాలామంది ‘టాటా’ అని ఇంటిపేరు వల్లే ఈ పదవి దక్కింది అనేవాళ్లు. కానీ, ఆయన ఫోకస్ మాత్రం ఆ పేరును మించి ఏదో సాధించాలని, క్రియేట్ చేయాలని, సమాజానికి తిరిగి ఇవ్వాలని ఉండేది. టాటా సంస్థల డీఎన్​ఏలో ఉన్నది కూడా ఆ లక్షణమే. ‘నా జీవితం కంపెనీ కోసం. కంపెనీ డెవలప్​మెంట్ కోసం మారింది’ అనేవారాయన.

ప్రయాణం ఎకానమీలోనే 

మామూలుగా ధనవంతులు, బిజినెస్ టైకూన్​లు కార్లలో వెనక సీట్​లో కూర్చుంటారు. కానీ, రతన్​టాటా మాత్రం డ్రైవర్ పక్కనే కూర్చుని ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి డ్రైవర్ లేకపోతే ఆయనే స్టీరింగ్ వీల్​ను అందుకుంటారు. విమానాల్లో తరచూ ఆయన ఎకానమీ క్లాసులోనే ట్రావెల్ చేసేవారు. ఆయనతో ప్యాసింజర్లు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.

రిటైర్​మెంట్ తర్వాత ప్రజాసేవలో

రిటైర్​మెంట్ తీసుకున్నాక ఆయన లైఫ్​ స్టయిల్ మారింది. ‘‘చాలామంది రిటైర్​ అయ్యారా? అని అడుగుతుంటారు. ‘అవును’ అనే చెప్తుంటారు. కంపెనీ బాధ్యతల నుంచి దూరంగా ఉన్నా. ఆ ఎడబాటును ఎంజాయ్ చేస్తున్నా. అనవసరమైన విషయాలను, ఇన్ఫర్మేషన్​ని నా దగ్గరకు రానివ్వను. అలాగని రిటైర్ అవ్వడమంటే గోల్ఫ్ ఆడుకోవడం, బీచ్​లో కాక్ టెయిల్ తాగుతూ గడపడం కాదు. అంతకుముందు కంటే ఇంకా ఎంతో చేయాలనే తపన మొదలైంది. క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ను మరింత అందుబాటులోకి తీసుకురావడం నుంచి గ్రామీణ భారతదేశంలో జీవితాలను మెరుగుపరిచేదాకా టాటా ట్రస్ట్​ ద్వారా ఎన్నో చేయాలనుకుంటున్నాం” అని చెప్పారాయన.

నాకు ముప్పు ఏముంటుంది?

ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర మంత్రి, మాజీ  ఐపీఎస్ ఆఫీసర్ ఆసిమ్ అరుణ్​ 2007–08 మధ్య ఎస్పీజీలో ఉండేవారు. అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రతా బాధ్యతలు చూస్తున్నారు. ఆ టైంలో రతన్​ టాటాను ఢిల్లీలోని తాజ్ మాన్​సింగ్​ హోటల్​ నుంచి సెక్యూరిటీతో ప్రధాని కార్యక్రమానికి తీసుకొచ్చే పనిని ఎస్పీజీకి అప్పగించారు. కానీ, రతన్​ మాత్రం అక్కడి ప్రెసిడెన్షియల్​ సూట్​కు బదులు ఒక మామూలు గది నుంచే వచ్చి 50 ఏండ్ల నాటి మెర్సిడిస్ కారులో డ్రైవర్​ని తీసుకుని వెళ్లిపోయారు. ఆ విషయం గురించి ఆయన్ను అడిగితే ‘నాకు ముప్పు ఏముంటుంది?’ అని నన్ను అడిగారు అని ఆసిమ్​ గుర్తుచేసుకున్నారు.

హైడ్రేషన్​–టీ

ఇండియన్స్​లో ఎక్కువమంది ఎలాగైతే టీని ఇష్టపడతారో అలానే టాటా కూడా టీ తాగడాన్ని ఇష్టపడతారు. కాకపోతే ఎక్కువ చక్కెర లేకుండా జాగ్రత్త పడేవారు. రోజంతా మంచినీళ్లు తాగుతుండేవారు. శరీరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోజంతా ఎనర్జిటిక్​గా ఉండాలంటే హైడ్రేషన్​ ముఖ్యం అని నమ్మి దాన్ని ఫాలో అయ్యేవారు.

జంక్​ ఫుడ్స్​కి దూరంఇలాంటి ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో చేటు కలుగుతుంది అని వాటిని దరిచేరనిచ్చేవారు కాదు టాటా. వాటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన పదార్థాలనే తినేవారు. దానివల్ల అనవసరమైన అడెటివ్స్​, ఫ్యాట్స్​​ వంట్లోకి చేరవు. మన చుట్టూ ఉన్న ఫాస్ట్​ ఫుడ్​, ఆర్టిఫిషియల్​ శ్నాక్స్​ సొసైటీకి దూరంగా ఉండాలంటే రతన్​టాటా ఫాలో అయిన ట్రెడిషనల్​ ఫుడ్​ డైట్​ తింటుంటే తిండి విలువ తెలుస్తుంది. సమ పోషకాలు అందుతాయి.

పెండ్లి చేసుకోలేదనే బాధ

ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ప్రేమలో పడతారు. కానీ, తొలిప్రేమ మాత్రం అందరికీ స్పెషల్! రతన్ జీవితంలోనూ కూడా తొలిప్రేమ మరపురానిది. అమెరికాలో ఆర్కిటెక్చర్​ కంపెనీలో రెండేండ్లు పనిచేశారు. ఆ పని, ఆ వాతావరణం బాగా నచ్చాయి. అక్కడే ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించారు. ఆమెతో నిశ్చితార్థం జరిగి పెండ్లి వరకూ వచ్చింది. కానీ, పెండ్లి జరగలేదు. 

దాని గురించి చెప్తూ ‘‘ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. నాతో పాటే ఆమె కూడా భారత్‌‌కు వస్తుందనుకున్నా. కానీ, అప్పుడు భారత్, చైనా మధ్య యుద్ధం (1962) జరుగుతోంది. దాంతో, ఆమెని ఇండియాకు పంపేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రతన్ టాటా. రతన్​, బాలీవుడ్​ సీనియర్ నటి సిమీ గరేవాల్ కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారు. ‘‘రతన్​తో సన్నిహితంగా ఉన్నాను. తర్వాత మేము ప్రేమికులుగా విడిపోయాం. స్నేహితులుగా కంటిన్యూ అయ్యాం” అని చెప్పారామె. రతన్​ చనిపోయారని తెలిశాక ‘‘మీరు లోకాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్తున్నారు. ఆ లోటు భరించడం చాలా కష్టం. గుడ్​ బై మై ఫ్రెండ్” అని ఎక్స్​లో పోస్ట్ చేశారామె. 

మా బంధం అపురూపం

‘‘నన్ను ఛైర్మన్​ చేయాలని డిసైడ్ అయ్యాక జేఆర్డీని కలవడానికి వెళ్లాను. ఆయన తన సెక్రటరీని పిలిచి ‘ఈ ఆఫీస్​ ఖాళీ చేసి రతన్​కు అప్పగించాల’ని చెప్పారు. నేను వెంటనే ‘లేదు జే.. దయచేసి మీరు ఖాళీ చేయొద్దు. ఇది మీ ఆఫీస్. మీరు కోరుకున్నన్ని రోజులు ఇక్కడే ఉండండి” అన్నాను. ‘మరి నువ్వెక్కడ కూర్చుంటావ్’ అనడిగితే.. ఇప్పుడు కూర్చున్న చోటు నాకు బాగుంది. సరిపోతుందని చెప్పా. జే అక్కడ ఉండడం లక్ అనుకుంటా. నాకు దొరికిన గొప్ప గైడ్ ఆయన. ఆయన ఉన్నంతకాలం కలిసేవాడిని. ఒక తండ్రిలా, బ్రదర్​లా ముందుకు నడిపించారు. మా బంధం అపురూపం’’ అని చెప్పారు రతన్.

అదనపు డబ్బు కోసం గిన్నెలు కడిగి.. 

కుమీ కపూర్‌‌కు రతన్ టాటా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. “ఆ రోజుల్లో విదేశాల్లో చదవడానికి రిజర్వ్ బ్యాంక్ చాలా తక్కువ విదేశీ కరెన్సీ వాడేందుకు అనుమతించేది. మా నాన్నకు చట్టాలను అతిక్రమించడం నచ్చదు. అందుకే ఆయన నా కోసం బ్లాక్‌‌లో డాలర్లు కొనేవారు కాదు. దానివల్ల నెల అయ్యేలోపే నా దగ్గర డబ్బులు అయిపోయేవి.  అలా చాలాసార్లు జరిగేది. 

దాంతో నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. చాలాసార్లు ఎక్స్​ట్రా మనీ సంపాదించడానికి గిన్నెలు కూడా కడిగాను” అని చెప్పారు. ‘‘రతన్ తన గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని నాతో చెప్పారు. ‘బహుశా నేను కలుపుగోలుగా ఉండే వ్యక్తిని కాకపోవచ్చు. అలాగని సమాజంలో కలవనివాడిని కూడా కాదు’ అని చెప్పార”ని కుమీ కపూర్ తన పుస్తకం “యాన్ ఇంటిమేట్ హిస్టరీ ఆఫ్ పార్శీస్‌‌”లో రాశారు. 

స్నేహానికి వయసు బేధం లేదు

వయసులో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహం చేసేవారాయన. అందుకు చనిపోయేవరకు ఆయనకు తోడుగా ఉన్న 31 ఏండ్ల శంతను నాయుడే కళ్లముందు ఉన్న ఎగ్జాంపుల్​. న్యూయార్క్​లోని కార్నెల్​ యూనివర్సిటీ నుంచి శంతను గ్రాడ్యుయేషన్ చేశాడు. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్​గా ఉంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్​షిప్ కుదిరింది. 

80ల్లో ఉన్న టాటాకు.. ఈ అబ్బాయికి మంచి అనుబంధం ఏర్పడింది. వీళ్లిద్దరినీ కలిపింది కుక్కలపై ఉన్న ప్రేమ. పెద్దవాళ్లతో స్నేహం చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్, వాళ్ల పట్ల ఉన్న ప్రేమ ‘గుడ్​ఫెల్లోస్​’ను మొదలుపెట్టడానికి కారణం అయ్యిందని దాని లాంచ్​ ఈవెంట్​లో చెప్పాడు శంతను. ఈ విషయం గురించే రతన్​ టాటా మాట్లాడుతూ.. ‘‘ఒక తోడుంటే బాగుండు అని కోరుకుంటూ ఒంటరిగా సమయం గడిపేవరకు ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలియదు’’ అన్నారు. 

మరో సందర్భంలో స్నేహం గురించి మాట్లాడుతూ ‘‘స్నేహానికి వయసుతో సంబంధం లేదు. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకుంటా. 82 ఏండ్లు దాటాక కూడా నేర్చుకుంటున్నా. అందుకే ఎవరైనా మంచి సలహా ఇవ్వమని అడిగితే.. మంచి సలహా అనేది టైం బట్టి మారుతుంది. కానీ, ఎప్పటికీ మారనిది  మంచి పని చేయాలన్న తపన. అది ఉంటే చాలని చెప్పాలనిపిస్తుంది అంటాను. అందుకే సలహాలు పక్కన పెట్టి కష్టమైనా సరే సరైన పని చేయడంపై ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సరైన పని చేయడమే కీలకం’’ అంటారు 
రతన్ టాటా.