- ఇటీవలే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్
- తాజాగా విహాన్‌గా ఎయిర్ ఇండియా పేరును మార్చిన వైనం
- గ్లోబల్ ఎయిర్‌లైనర్‌గా స్థిరపడేందుకు ప్రణాళికలు సిద్ధం
- రాబోయే ఐదేళ్లలో వాటాను 30 శాతానికి పెంచుకోవడమే లక్ష్యం
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ కీలక ప్రకటన చేసింది. పేరు మార్చుకోబోతున్నట్లు వెల్లడించింది. కొత్త పేరుతో ప్రయాణికుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎయిర్ ఇండియా పేరు.. విహాన్‌గా (Vihaan.AI) మారనుందని పేర్కొంది. అలాగే కంపెనీ తన దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను కూడా ప్రకటించింది. భారతీయ మూలాలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేందుకు, స్థిరపడేందుకు సమగ్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది.
నెట్‌వర్క్, ఫ్లీట్ వృద్ధి
కొత్త ప్రణాళికలలో భాగంగా ఎయిర్ ఇండియా తన నెట్‌వర్క్, ఫ్లీట్ రెండింటినీ మరింత వృద్ధి చేయనుంది. అలాగే కస్టమర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం, విశ్వసనీయత, సమయ పాలన, పని తీరును మెరుగుపరచడం, సాంకేతికత, స్థిరత్వం, కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులపై దృష్టి వంటి కీలక అంశాలన్నింటికీ కంపెనీ అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. టాటా గ్రూప్ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాబోయే ఐదేళ్లలో ఎయిర్ ఇండియా దేశీయ మార్కెట్‌లో తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుత మార్కెట్ వాటాలో అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది.
ఫీడ్‌బ్యాక్ ఆధారంగా..
ఎయిర్ ఇండియా తన ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘విమానయాన సంస్థ తక్షణ దృష్టి ప్రాథమిక అంశాలను పరిష్కరించడం, వృద్ధికి దోహదపడే నిర్ణయాలపైనే ఉంది. గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్‌గా ఎదగడానికి దీర్ఘకాల దృష్టితో ముందుకు వెళ్తాం’ అని కంపెనీ పేర్కొంది.
చరిత్రాత్మక మార్పునకు నాంది
‘ఇది ఎయిర్ ఇండియా చరిత్రాత్మక మార్పునకు ఒక నాంది. కొత్త శకానికి తొలి అడుగు. కొత్త ఉద్దేశంతో అద్భుతమైన ఉత్సాహంతో కొత్త ఎయిర్ ఇండియా కోసం మేము పునాది వేస్తున్నాం’ అని ఆ సంస్థ ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఒకప్పటిలా మళ్లీ ప్రపంచ పటంలో ఎయిర్ ఇండియాకు అదే స్థానాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం గతంలో టాటాల నుంచి ఎయిర్ ఇండియాను తీసుకొని జాతికి అంకితం చేసింది. మళ్లీ తర్వాత ఎయిర్ ఇండియా సొంత గూటికి చేరింది. ఇప్పుడు ఏకంగా కంపెనీ పేరును మార్చబోతోంది. ఇకపై కొత్త ప్రణాళికతో దూసుకుపోనుంది.