TATA: రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయని బాధపడకండి.. మంచి రోజులొస్తున్నాయ్..

టెలికాం రంగంలోకి రతన్ టాటా మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలపై మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అప్పట్లోనే అతి తక్కువ ధరకు ఫ్రీ మినిట్స్ ఇచ్చిన టెలికాం బ్రాండ్ టాటా ఇండికాం గుర్తుండే ఉంటుంది. తాజాగా రతన్ టాటా మళ్లీ టెలికాం రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే ఈసారి బీఎస్ఎన్ఎల్తో కలిసి టెలికాం సేవలను అందించాలని రతన్ టాటా నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. డేటా సెంటర్స్ సెటప్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల రూ.15 వేల కోట్లు బీఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్లో టీసీఎస్ ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. భారత్లోని 1000 మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడమే టీసీఎస్, బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ముఖ్య ఉద్దేశం. ఈ 1000 గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 4జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

బీఎస్ఎన్ఎల్లో టాటా పెట్టుబడులు పెట్టారని తెలియగానే బీఎస్ఎన్ఎల్ను టాటా సంస్థ మొత్తానికే తీసేసుకుంటోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ మెరుగుపరిచే డీల్ మాత్రమే తప్ప కొనుగోలు చేసుకునే ఉద్దేశంతో చేసిన డీల్ కాదు. టాటా, బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం ఇతర టెలికాం కంపెనీలకు కాస్తంత ఆందోళన కలిగించే విషయమేనని చెప్పక తప్పదు. జియో, ఎయిర్టెల్, వీఐ జులైలోనే టారిఫ్ ఛార్జీల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆ రీఛార్జ్ ప్లాన్ల పెంపు భారాన్ని మోయలేక కొందరు యూజర్లు బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టుకుని మారిపోయారు. ప్రధాన నగరాల్లో 5జీ నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో నేటి నుంచి 5జీ సిమ్ కార్డులను కూడా బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది.