భద్రాచలం, వెలుగు: ఎమ్మెల్సీ తాతా మధును భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిగా నియమించడాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఇక్కడ ఏం పని అంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ నాయకుల్లో సఖ్యత కుదర్చలేని ఆయన ఇక్కడ ఏం చేస్తారంటూ మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌మండల కమిటీ అధ్యక్షులు, సభ్యులు తాతా మధుపై గుర్రుగా ఉన్నారు.
అభ్యర్ధి ఎవరైనా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నప్పటికీ ఇన్చార్జ్ విషయానికి వచ్చేసరికి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవల పక్క నియోజకవర్గం పినపాకలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో మహబూబాబ్బాద్ ఎంపీ మాలోత్ కవిత, తాతా మధు మీటింగ్ పెట్టినా భద్రచం నియోజకవర్గంలోని మండల కమిటీల నాయకులు వెళ్లలేదు. తాము రాము అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దాంతో భద్రాచలంలో నిర్వహించాల్సిన భారీ ర్యాలీని రద్దు చేశారు.
ALSO READ :సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్‌పై .. రెండోసారి అవిశ్వాసం
కేటీఆర్ తేల్చుతారు!
నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జ్ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ తేలుస్తారని అసమ్మతివర్గం నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల్లో వివాదానికి తెర పడుతుందని అంటున్నారు. ఇక్కడ మంత్రి పువ్వాడకు బలమైన వర్గం ఉంది. సీఎం కేసీఆర్కోటరీలో కీలక నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బంధువు కావడంతోనే తాతా మధుకు ప్రాధాన్యం లభిస్తోందని, జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మంలో ఏమీ చేయలేకపోయిన మధు ఇక్కడ ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇన్‌చార్జ్‌ను మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే స్థానికుడైన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణపై తప్పుడు ప్రచారాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలసాని కాంగ్రెస్‌లోకి పోతున్నారని మీడియాకు చెబుతూ.. తప్పుదోవ పట్టిస్తోందని తాతా మధు వర్గమేనని ఆరోపిస్తున్నారు.