
- అదరగొట్టిన జేఎల్‌ఆర్
- తగ్గిన టాటా ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్స్ రెవెన్యూ
- రికార్డ్ లెవెల్లో మారుతీ సేల్స్..రూ.3,727 కోట్లకు లాభం
న్యూఢిల్లీ:టాటా మోటార్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) కిందటేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్ ( క్యూ3) లో రూ.5,578 కోట్లకు తగ్గింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.7,145 కోట్లతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ. టాటా మోటర్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ క్యూ3 లో రూ. 1,13,575 కోట్లుగా రికార్డయ్యింది.
2023 డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.1,10,577 కోట్ల నుంచి పెరిగింది. ఇదే టైమ్‌లో కంపెనీ ఖర్చులు రూ.1,04,494 కోట్ల నుంచి రూ.1,07,627 కోట్లకు ఎగిశాయి. సబ్సిడరీ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) క్యూ3 లో రికార్డ్ లెవెల్‌లో రూ.80 వేల కోట్ల (750 కోట్ల పౌండ్ల) రెవెన్యూ సాధించింది.
ఈ కంపెనీ వరుసగా 9వ క్వార్టర్‌లోనూ లాభాలు గడించింది. ‘జేఎల్‌ఆర్ క్యూ3లో అదరగొట్టింది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత రెవెన్యూ, మార్జిన్స్ సాధించాం. ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చే పనిలో ఉన్నాం’ అని జేఎల్‌ఆర్ సీఈఓ అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్న టార్గెట్లను చేరుకుంటామని అన్నారు. కార్లను అమ్మే టాటా ప్యాసింజర్ డివిజిన్ క్యూ3లో రూ.12,400 కోట్ల రెవెన్యూ సాధించింది. కానీ, 2023 డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రెవెన్యూతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ. క్యూ3 లో 1.4 లక్షల కార్లను కంపెనీ అమ్మింది.
టాటా కమర్షియల్ వెహికల్ డివిజన్ నుంచి టాటా మోటార్స్‌కు రూ.18,400 కోట్ల రెవెన్యూ రాగా, ఇండియాలో 91,100 బండ్లను అమ్మింది. టాటా మోటార్స్ షేర్లు 3.65 శాతం లాభపడి రూ.755 దగ్గర ముగిశాయి.