టాటా పవర్, ఎన్​టీపీసీ జోడీ.. 200 మెగావాట్ల గ్రీన్ ప్రాజెక్ట్ నిర్మాణం

టాటా పవర్, ఎన్​టీపీసీ జోడీ.. 200 మెగావాట్ల గ్రీన్ ప్రాజెక్ట్ నిర్మాణం

న్యూఢిల్లీ: టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్​ఈఎల్​) 200 మెగావాట్ల క్లీన్ పవర్ ప్రాజెక్ట్‌‌‌‌ను అభివృద్ధి చేయడానికి ఎన్టీపీసీ లిమిటెడ్‌‌‌‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌తో తమ మొత్తం పునరుత్పాదక వినియోగ సామర్థ్యం 10.9 గిగావాట్లకి చేరుకుందని టాటా పవర్ అనుబంధ సంస్థ అయిన టీపీఆర్​ఈఎల్​ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ (ఎఫ్​డీఆర్​ఈ) ప్రాజెక్ట్ 24 నెలల్లోపు పూర్తి కానుంది. ఇది  ఏడాది లెక్కన సుమారు 1,300 మిలియన్ యూనిట్ల (ఎంయూలు) విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుందని టీపీఆర్​ఈఎల్​ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. కాంపిటీషన్​ బిడ్డింగ్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను టీపీఆర్​ఈఎల్​ గెలుచుకుంది.  

ఈ ప్రాజెక్ట్‌‌‌‌తో టీపీఆర్​ఈఎల్​  మొత్తం పునరుత్పాదక వినియోగ సామర్థ్యం 10.9 గిగావాట్లకి చేరుకుంది. ప్రస్తుతం, ఈ సామర్థ్యంలో 5.5 గిగావాట్ల ఉత్పత్తిలో ఉంది. ఇందులో 4.5 గిగావాట్ల సౌర,  1 గిగావాట్​ పవన శక్తి ఉన్నాయి. అదనంగా 5.4 గిగావాట్ల ఉత్పత్తి  వివిధ దశలలో ఉంది.   కొనసాగుతున్న ప్రాజెక్టులు రాబోయే 6 నుంచి 24 నెలల్లో దశలవారీగా పూర్తి అవుతాయని భావిస్తున్నారు.