IPL: మరో ఐదేళ్లు టాటాకే ఐపీఎల్ టైటిల్ హక్కులు.. బీసీసీఐకి 2500 కోట్ల ఆదాయం

IPL: మరో ఐదేళ్లు టాటాకే ఐపీఎల్ టైటిల్ హక్కులు.. బీసీసీఐకి 2500 కోట్ల ఆదాయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కులను టాటా గ్రూప్ నిలుపుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు అనగా.. 2028 వ‌ర‌కు టాటానే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవ‌హ‌రించ‌నున్నట్లు తెలిపింది. అందుకుగానూ టాటా గ్రూప్.. బీసీసీఐకి వేల కోట్ల రూపాయలు ముట్టచెప్పనుంది.

నిజానికి 2018లో టైటిల్ స్పాన్సర్ హక్కులను చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో దక్కించుకుంది. కానీ భారత్-చైనా దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో గత సీజన్ ప్రారంభంలో వివో తప్పుకుంది. ఈ క్రమంలోనే టైటిల్ స్పాన్సర్‌గా టాటాకు అవ‌కాశం వ‌చ్చింది. ఆ సమయంలో టాటా గ్రూప్.. ప్రతి సీజ‌న్‌కు బీసీసీఐకి రూ.365 కోట్లు చెల్లించేందుకు అంగీక‌రించింది. అయితే ఐపీఎల్ నిర్వాహకులు ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల కోసం బిడ్డింగ్ పక్రియను ప్రారంభించగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడాదికి రూ.500 కోట్లు చెల్లించేలా రూ.2500 కోట్లతో టెండర్ వేసింది. కానీ, రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించి టాటా బిడ్‌ను గెలుచుకుంది.

ఐపీఎల్ నియమాలలో రైట్ టు మ్యాచ్ కార్డ్(ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్‌) నిబంధన ఒకటి. ఈ నియమం ప్రకారం, మాజీ స్పాన్సర్ తన హక్కును దక్కించుకోవడానికి ఈ కార్డ్‌ని మళ్లీ ఉపయోగించవచ్చు. దీని ప్రకారం ఆదిత్య బిర్లా గ్రూప్ వేసిన మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించిన టాటా టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు నిలుపుకుంది. 2028 వరకు కొనసాగే టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టాటా ప్రతీ సీజన్‌కు రూ.500 కోట్లు చెల్లించనుంది. కాగా, రాబోవు సీజన్ ఐపీఎల్ మార్చి 2022 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.