ముంబై: ఇటీవల కన్నుమూసిన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా తనకున్న రూ. 10 వేల కోట్ల విలువైన ఆస్తులపై వీలునామా రాశారు. ఈ ఆస్తుల్లో ఎవరెవరికి ఎంతెంత దక్కాలో ఆయన వీలునామాలో పొందుపరిచారు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పెంపుడు కుక్క దాకా తన ఆస్తులను కేటాయించారు. ప్రధానంగా టాటా ఫౌండేషన్లకు, సోదరుడు జిమ్మీ టాటా, సవతి తల్లి పిల్లలు షిరీన్, దీనా జెజీబోయ్ లకు తన ఆస్తులను పంచుతున్నట్లు వీలునామాలో తెలిపారు. మూడు దశాబ్దాలుగా తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సర్వెంట్ సుబ్బయ్య, వంటవాడు రాజన్ షాతో పాటు తన పెంపుడు కుక్క "టిటో"కు కూడా రతన్ టాటా తన ఆస్తుల్లో వాటా ఇచ్చారు. టిటో సంరక్షణ బాధ్యతలను పూర్తిగా రాజన్ షాకు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడు గురించి కూడా టాటా తన వీలునామాలో పేర్కొన్నారు. శంతను నాయుడికి చెందిన వెంచర్ గుడ్‌ఫెలోస్‌లో తన వాటాను వదులుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేగాక విదేశాల్లో చదివేందుకు శంతను నాయుడు తీసుకున్న లోన్ కూడా టాటా మాఫీ చేశారు.
టాటాకు చెందిన కొన్ని ఆస్తుల వివరాలు..
రతన్ టాటాకు మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 2 వేల చదరపు అడుగుల బీచ్ బంగ్లా ఉంది. ముంబైలోని జుహు తారా రోడ్‌లో రెండంతస్తుల ఇల్లు కూడా ఉంది. వివిధ బ్యాంకుల్లో 350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్‌కు మాతృ సంస్థ అయిన టాటా సన్స్‌లో 0.83% వాటా ఉంది. టాటా సన్స్‌లోని వాటాలతో పాటు, టాటా మోటార్స్ ఇతర టాటా గ్రూప్ కంపెనీల్లోని ఆయన వాటాలను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్(ఆర్టీఈఎఫ్)కి బదిలీ చేయనున్నారు. టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ ఇప్పుడు ఆర్టీఈఎఫ్ చైర్మన్ గా ఉన్నారు. రతన్ టాటా చనిపోయే వరకు కొలాబాలోని హలేకై హౌస్ లో ఉన్నారు. ఇది టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎవర్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందినది. వీలునామాలో దీన్ని ఎవ్వరికీ కేటాయించలేదు. రతన్ టాటా వద్ద 20 నుంచి 30 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎవరికీ ఇవ్వలేదు. వీటిని వేలం వేయాలా లేదా రతన్ టాటా గౌరవార్థం టాటా గ్రూప్ కు చెందిన పూణే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలా అనేది త్వరలో నిర్ణయించనున్నారు.